Site icon NTV Telugu

Odisha: ఒడిశాలో భారీ వర్షాలు, వరదలు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

Odisha

Odisha

Heavy rains and floods in Odisha: ఒడిశా రాష్ట్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. ఒడిశాతో పాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్ లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బాలాసోర్, మయూర్ భంజ్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. ఈ ప్రాంతం గుండా వైతరణి, సువర్ణ రేఖ నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందికి సంబంధించిన 58 రెస్క్యూ టీములు ఈ రెండు జిల్లాల్లోనే మోహరించాయి.

Read Also: Earthquake: రాజస్థాన్ లో భూకంపం.. 4.1 తీవ్రతతో కంపించిన భూమి

సువర్ణరేఖ నది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో సోమవారం మధ్యాహ్నానికి 1.2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం నవీన్ పట్నాయక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ల ద్వారా సహాయం అందించాలని ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మహానది వ్యవస్థలోని చిన్నాచితక నదులు ప్రమాదతీవ్రతను దాటి ప్రవహిస్తున్నాయి. వరదల ప్రభావంతో ఒడిశాలోని 7 లక్షల మంది ప్రభావితం అయ్యారు. ప్రభుత్వం అంచనాల ప్రకారం రాష్ట్రంలో 763 గ్రామాల్లో దాదాపు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా ఒడిశాలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. సంబల్ పూర్ జిల్లాలో శనివారం ఇద్దరు చనిపోగా.. శుక్రవారం గోడకూలి మరో నలుగురు మరణించారు. బాలాసోర్, మయూర్‌భంజ్, కియోంఝర్ జిల్లాల్లో ఆగస్టు 23, 24 తేదీల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

Exit mobile version