Site icon NTV Telugu

Rajasthan: మణిపూర్‌ గురించి మాట్లాడాడు.. మంత్రి పదవి పోయింది

Rajasthan

Rajasthan

Rajasthan: మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల గురించి ఒక మంత్రి మాట్లాడారు. మాట్లాడిన గంటల వ్వవధిలోనే ఆయన మంత్రి పదవి పోయింది. అదేంటీ మణిపూర్‌ గురించి మాట్లాడితే.. ఈయన మంత్రి పదవి ఎందుకు పోయిందని అనుకుంటున్నారా? రాజస్థాన్‌ మంత్రి మణిపూర్‌లో మహిళలపై జరిగిన దాడులు, అత్యాచారాలపై మాట్లాడారు. అక్కడ పరిస్థితి అలా ఉందని అంటున్నారు.. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏమిటనీ అసెంబ్లీలోనే మంత్రి ప్రశ్నించారు. దీంతో అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం గంటల్లోనే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. రెండున్నర నెలలుగా మణిపూర్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు.. తాజాగా వెలుగులోకి వచ్చిన అకృత్యాలపై కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రంతో పాటు మణిపూర్‌ ప్రభుత్వం పైనా ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి రాజేంద్ర సింగ్‌ గుధా.. రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాల కట్టడికి మన ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కఠిన వాస్తవం ఏంటంటే.. మన ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతోంది. రాజస్థాన్‌లో మహిళలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కాబట్టి.. మణిపూర్‌ అంశంపై దృష్టిసారించే బదులు ముందు నా సహచరులు మన సంగతి చూసుకోవడం ఉత్తమం అంటూ రాజేంద్ర సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌ మినిమమ్‌ గ్యారెంటీ బిల్‌ 2023పై చర్చ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్‌ శాఖల మంత్రిగా ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also: Venkateswara Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ సంకల్పాలు నెరవేరుతాయి

మంత్రి వ్యాఖ్యలు రాజకీయ సంచలనానికి దారి తీయగా.. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. రాజేంద్ర సింగ్‌ గుధాను మంత్రివర్గం నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు రాజస్థాన్‌ రాజ్‌భవన్‌కు సిఫార్సు పంపగా.. గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా దానికి ఆమోదం తెలిపినట్లు తెలిసింది. గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ రాజేంద్ర వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని.. కాంగ్రెస్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది. అంతకు ముందు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ఆరంభానికి ముందు కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తింటున్నాయని, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version