NTV Telugu Site icon

Gyanavapi masjid row: బయటపడిన శివలింగాన్ని మాకు అప్పగించాలి

Gyanavapi Shivling

Gyanavapi Shivling

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్టు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇదిలా ఉంటే మసీదులో ఉన్న బావితో శివలింగం బయటపడిందని తెలుస్తోంది.  నిజానికి సర్వే రిపోర్టును ఈ నెల 17న వారణాసి కోర్టుకు అందించాలి… అయితే మసీదులోని వాజుఖానా బావిలో శివలింగ ఆకారం బయటపడటంతో సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రెండు రోజులు గడువు కావాలని కోరారు కోర్ట్ కమిషనర్లు. దీనికి వారణాసి కోర్ట్ అనుమతించింది.

మరోవైపు జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వీడియో సర్వేను ఆపేయాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్ ను మంగళవారం సుప్రీం కోర్ట్ విచారించింది. శివలింగం బయటపడిన ప్రాంతాన్ని రక్షించాల్సిందిగా వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. అదే విధంగా ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది.

ఇదిల ఉంటే జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ శివలింగాన్ని తమకు ఇవ్వాలని కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రొఫెసర్ నాగేంద్ర పాండే డిమాండ్ చేశారు. శివలింగం బయట పడితే అది ‘వజుఖానా’ ఎలా అవుతుందని ప్రశ్నించారు. శివలింగాన్ని కాశీ విశ్వనాథ్ న్యాస్ కు అప్పగిస్తే భగవంతుడికి సక్రమంగా పూజలు చేస్తామని పాండే అన్నారు.ఇదిలా ఉంటే… శివలింగం ఉన్నవజుఖానా పక్కనే ఉన్న గోడను కూల్చివేయాలని వారణాసి కోర్టులలో పిటిషన్ దాఖలైంది.

వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయంలోని భాగంగా ఉన్న జ్ఞానవాపి ఆలయాన్ని మొగల్ పాలకుల సమయంలో ఔరంగజేబు ధ్వంసం చేసి మసీదుగా మర్చారని చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి ఆధారం చేకూరుస్తూ… ఆలయంలోని వెనకభాగంలో హిందు ఆలయానికి సంబంధించిన స్తంబాలు, గోడ కనిపిస్తున్నాయని హిందూ సంఘాలు చెబుతున్నాయి. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ దేవతలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు కోర్ట్ లో పిటిషన్ వేయగా… వారణాసి కోర్ట్ వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది.