Anti Suicide Fans : యూనివర్సిటీ కీలక నిర్ణయం.. హాస్టళ్లలో యాంటీ సూసైడ్ ఫ్యాన్లు ఏర్పాటు

  • తొమ్మిది హాస్టళ్లలో 388 ప్రత్యేక ఫ్యాన్లు
  • అధిక బరువు పడితే ఆటోమేటిక్‌గా విద్యుత్ నిలిపివేత
  • విద్యార్థుల భద్రతకు యూనివర్సిటీ ప్రాధాన్యం
  • కౌన్సెలింగ్‌తో మానసిక ఆరోగ్యానికి భరోసా
Anti Suicide Fans

Anti Suicide Fans

గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU) విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక వినూత్న , ఆచరణాత్మక చర్యకు శ్రీకారం చుట్టింది. క్యాంపస్‌లోని అన్ని విద్యార్థి హాస్టళ్లలో కలిపి మొత్తం 388 ప్రత్యేక యాంటీ సూసైడ్ సీలింగ్ ఫ్యాన్లను బిగించింది. విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురై ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ముందస్తు నివారణ చర్యగా యూనివర్సిటీ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.

అన్ని హాస్టళ్లలోనూ ప్రత్యేక ఫ్యాన్ల బిగింపు

యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న మొత్తం తొమ్మిది విద్యార్థి హాస్టళ్లలో ఈ ప్రత్యేక ఫ్యాన్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో ఐదు బాలికల హాస్టళ్లు, నాలుగు బాయ్స్ హాస్టళ్లు ఉన్నాయి. అమ్మాయిల హాస్టళ్లలో 170 యూనిట్లు, బాయ్స్ హాస్టళ్లలో 218 యూనిట్ల చొప్పున మొత్తం 388 యాంటీ సూసైడ్ ఫ్యాన్లను విజయవంతంగా అమర్చినట్లు అధికారులు తెలిపారు.

ఎలా పనిచేస్తుంది ఈ భద్రతా వ్యవస్థ?

ఈ ప్రత్యేక ఫ్యాన్లు సాధారణ రోజుల్లో ఇతర సాధారణ సీలింగ్ ఫ్యాన్ల లాగే గాలిని ఇస్తూ సక్రమంగా పనిచేస్తాయి. అయితే వీటిలో ఒక వినూత్న అంతర్గత భద్రతా వ్యవస్థ (బిల్ట్-ఇన్ సేఫ్టీ సిస్టమ్) ఉంటుంది. ఒకవేళ ఫ్యాన్‌పై 10 కిలోల బరువు కంటే ఎక్కువ లోడ్ పడితే, వెంటనే అంతర్గత స్ప్రింగ్ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ఫ్యాన్ కిందకి జారిపోవడంతో పాటు ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఒక్కో ప్రత్యేక యూనిట్ ధర సుమారు రూ. 2,500 పైమాటే ఉంటుందని అధికారులు వెల్లడించారు. అత్యవసర సంక్షోభ సమయాల్లో విద్యార్థులను ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ఈ పరికరం ఒక భౌతిక అడ్డుకట్టలా పనిచేస్తుందని యూనివర్సిటీ భావిస్తోంది.

అధికారుల స్పందన.. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత

తమ క్యాంపస్‌లో ఇప్పటివరకు ఎటువంటి దుర్ఘటనలు జరగనప్పటికీ, ఇతర చోట్ల వెలుగుచూస్తున్న బాధాకరమైన ఘటనలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తమైనట్లు వీసీ కిషోర్ సిన్హ్ చావడా తెలిపారు. కేవలం భౌతిక మార్పులతోనే మానసిక సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోయినా, ప్రాణాలను కాపాడేందుకు ఇదొక మంచి ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షల ఒత్తిడికి భయపడి ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు యూనివర్సిటీ ఏడాదికి ఎన్నిసార్లయినా పరీక్షలు నిర్వహిస్తుందని, విద్యార్థులు ఆత్మహత్య ఆలోచనల జోలికి వెళ్లకూడదని కోరారు. హార్డ్‌వేర్ మార్పులతో పాటు విద్యార్థులతో బహిరంగ చర్చలు, కౌన్సెలింగ్ సేవలు, వ్యక్తిగత సపోర్ట్ సిస్టమ్ కూడా విద్యార్థి ఆందోళనలను తగ్గించడంలో కీలకమని యంత్రాంగం స్పష్టం చేసింది.