Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!

  • గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్‌కు రాష్ట్రపతి ఆమోదం
  • వివాహం, విడాకులు, ఆస్తి, లివ్-ఇన్‌లపై కీలక నిబంధనలు
  • మార్చి 24, 2026న బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం
Droupadimurmu

Droupadimurmu

గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్లు-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో గుజరాత్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు కీలకమైన రాజ్యాంగ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రపతి భవన్ రికార్డుల ప్రకారం.. ఈ బిల్లుకు సెప్టెంబర్ 17, 2026న ఆమోదం లభించింది. ఉత్తరాఖండ్ తర్వాత UCCకి రాష్ట్రపతి ఆమోదం పొందిన రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.

మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి హక్కులు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్ వంటి వ్యక్తిగత పౌర వ్యవహారాలకు ఒకే చట్టపరమైన విధానం తీసుకురావడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశంగా ఉంది. అయితే షెడ్యూల్డ్ తెగలు (STలు) ఈ చట్ట పరిధి నుంచి మినహాయించారు.

అసెంబ్లీలో ఏం జరిగింది?

గుజరాత్ అసెంబ్లీ మార్చి 24, 2026న ఏడు గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం UCC బిల్లును ఆమోదించింది. బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి.. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ చట్టం సమానత్వం, సామాజిక సామరస్యం, జాతీయ సమైక్యతకు దోహదపడుతుందని పేర్కొన్నారు. బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన అనంతరంరాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. తాజాగా ఆమోదం లభించింది. గుజరాత్ UCCలో వివాహానికి సంబంధించి మతాలతో సంబంధం లేకుండా ఒకే విధమైన నిబంధనలు ఉంటాయి. పురుషులకు కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు, మహిళలకు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. మతపరమైన సంప్రదాయాలు లేదా ఇతర చట్టబద్ధమైన విధానాల ప్రకారం వివాహం చేసుకోవచ్చు. అయితే వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ చేయకపోతే జరిమానా విధించే నిబంధన ఉంది. అలాగే ఒక వివాహం చెల్లుబాటులో ఉన్న సమయంలో మరో వివాహం చేసుకోవడాన్ని చట్టం నిషేధిస్తుంది. అంటే బహుభార్యత్వానికి అవకాశం ఉండదు. నిషేధిత బంధుత్వ పరిధిలోని వ్యక్తుల మధ్య వివాహాలపైనా నిబంధనలు విధించారు.

‘నికాహ్ హలాలా’పై నిషేధం

విడాకులు పొందిన మహిళ తన మాజీ భర్తను తిరిగి వివాహం చేసుకునే ముందు మరో వ్యక్తిని వివాహం చేసుకుని.. ఆ తర్వాత విడాకులు తీసుకోవాల్సిన ‘నికాహ్ హలాలా’ విధానాన్ని చట్టం అనుమతించదు. విడాకులు పొందిన భార్యాభర్తలు ఎలాంటి షరతు లేకుండానే తిరిగి వివాహం చేసుకోవచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ విధానాన్ని బలవంతం చేయడం లేదా ప్రోత్సహించడం చట్టపరమైన చర్యలకు దారితీసేలా నిబంధనలు ఉన్నాయి. విడాకుల విషయంలోనూ మతాల వారీగా ఉన్న వేర్వేరు విధానాలకు బదులుగా ఒకే విధమైన న్యాయపరమైన ప్రక్రియను UCC తీసుకొస్తుంది.

వ్యభిచారం, క్రూరత్వం, వరుసగా రెండేళ్ల పాటు విడిచిపెట్టడం, మత మార్పిడి, నయం కాని మానసిక అస్వస్థత వంటి కారణాలతో భార్య లేదా భర్త విడాకులు కోరవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భార్యకు అదనపు విడాకుల హక్కులను కూడా చట్టం కల్పిస్తుంది. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇందుకు వారు కనీసం ఏడాది పాటు వేర్వేరుగా నివసించి ఉండాలి.

ఇక వీలునామా లేకుండా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆస్తి పంపిణీకి UCC ఒకే విధమైన వారసత్వ వ్యవస్థను తీసుకొస్తుంది. నిర్దేశించిన వారసత్వ క్రమం ప్రకారం జీవించి ఉన్న జీవిత భాగస్వామి లేదా భాగస్వాములు, పిల్లలు, ముందే మరణించిన పిల్లల వారసులు, జీవించి ఉన్న తల్లిదండ్రులకు వాటాలు ఉంటాయి. మతంతో సంబంధం లేకుండా కొడుకులు, కూతుళ్లకు సమాన వారసత్వ హక్కులు కల్పించే విధానం ఇందులో ఉంది. అయితే వీలునామా ద్వారా ఆస్తి పంపిణీ చేసే హక్కును చట్టం తొలగించదు. చెల్లుబాటు అయ్యే వీలునామా ఉంటే దాని ప్రకారమే ఆస్తి పంపిణీ చేయవచ్చు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

గుజరాత్ UCCలో అత్యంత చర్చనీయాంశమైన అంశాల్లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించిన నిబంధనలు ఒకటి. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ను రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. సంబంధం ప్రారంభమైన తర్వాత దాని వివరాలను నిర్ణీత రిజిస్ట్రార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధం ముగిసిన విషయాన్ని కూడా అధికారులకు తెలియజేయాలి. ఇద్దరిలో ఎవరైనా మైనర్ అయితే.. అప్పటికే వివాహం చేసుకుని ఉంటే, మరో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటే లేదా నిషేధిత బంధుత్వ పరిధిలో ఉంటే ఆ సంబంధాన్ని రిజిస్టర్ చేయడానికి అనుమతి ఉండదు. ఒక నెలకు పైగా కలిసి నివసించిన తర్వాత కూడా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ను రిజిస్టర్ చేయకపోతే మూడు నెలల వరకు జైలు శిక్ష, రూ.10 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే నిబంధన ఉంది. వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్ చేయకపోయినా రూ.10 వేల వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. ఇక లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జన్మించిన పిల్లలను ఆ జంటకు చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తించే నిబంధనలు UCCలో ఉన్నాయి. అలాగే లివ్-ఇన్ భాగస్వామి వదిలిపెట్టిన మహిళకు భరణం కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించారు.

UCC బిల్లు అసెంబ్లీలో చర్చకు వచ్చిన సమయంలో ప్రతిపక్షాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా ఈ బిల్లు సమాజానికి వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానిస్తూ.. ముఖ్యంగా ముస్లిం మహిళలకు సంబంధించిన ఇతర సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఆప్ ఎమ్మెల్యే ఛతర్ వసావణే కూడా బిల్లుపై ప్రశ్నలు లేవనెత్తారు. గిరిజన మహిళలు తమ సమాజానికి వెలుపల వివాహం చేసుకున్నప్పుడు ఈ చట్టం ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల తప్పనిసరి రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ చేయకపోతే శిక్షలు వంటి నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛ, వయోజనుల వ్యక్తిగత సంబంధాల్లో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై చట్టపరమైన చర్చకు దారితీశాయి.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం.. దేశ పౌరుల కోసం యూనిఫామ్ సివిల్ కోడ్‌ను సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ 2025లో UCCను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో గుజరాత్ కూడా UCC చట్టపరమైన వ్యవస్థను ముందుకు తీసుకెళ్లింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత అమలు ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్, పరిపాలనా ఏర్పాట్లు తదుపరి దశగా ఉంటాయి.