Gujarat riots case.. SC grants interim bail to Teesta Setalvad: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు ప్రయత్నించేందుకు కల్పిత పత్రాలు, ఆరోపణలు చేశారనే కేసులో ప్రముఖ ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆమెకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. మా దృష్టిలో తీస్తా సెతల్వాడ్ బెయిల్ కు అర్హురాలు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే తీస్తా సెతల్వాడ్ విచారణకు సహకరించాలని.. పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని కోరింది.
2002 గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తీస్తా సెతల్వాడ్ కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించింది గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ వింగ్. జూన్ 25న తీస్తా సెతల్వాడ్ అరెస్ట్ జరిగింది. తాజాగా ఆమె బెయిల్ కోసం అభ్యర్థిస్తూ.. సుప్రీంకోర్టులో పటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సీజేఐ యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం విచారించి బెయిల్ మంజూరు చేసింది.
Read Also: K. A. Paul: హైదరాబాద్‌లో ప్రపంచ శాంతి సమావేశాలు.. 28 మంది ప్రధానులకు ఆహ్వానం
సెతల్వాడ్ తో పాటు ఈ కేసులో అప్పటి గుజరాత్ డీజీపీ ఆర్బీ శ్రీ కుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కూడా నిందితుడిగా ఉన్నారు. తీస్తా సెతల్వాడ్ తో పాటు శ్రీకుమార్ కూడా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీరు బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని గుజరాత్ ప్రభుత్వం వాదిస్తోంది.
అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని కేసులో ఇరికించడంతో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు తీస్తా సెతల్వాడ్ తో పాటు దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్రకు తెర తీశారు. ఈ మొత్తం కుట్రలో తీస్తా సెతల్వాడ్, డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ నిందితులుగా ఉన్నారు. అయితే ఈ గుజరాత్ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్.. నరేంద్రమోదీకి క్లిన్ చిట్ ఇచ్చింది. సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ ను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ ను జూన్ 24న సుప్రీంకోర్టు కొట్టేసింది. దీని తర్వాత తీస్తా సెతల్వాడ్, ఇతర నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అల్లర్ల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీతో పాటు 64 మందికి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది.
