ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో మరోసారి అధికారం చేజిక్కించుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల హార్దిక్ పటేల్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేర్చుకుంది. ఎన్నికలకు సంబంధించి సన్నద్ధం అవుతోంది.
ఇదిలా ఉంటే ఎన్నికల ముందు బీజేపీకి కొత్త చిక్కు వచ్చిపడింది. పటేల్ సామాజిక వర్గం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. పాటిదార్ సంఘం, వివిధ సంస్థలు ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. గతంలో అహ్మదాబాద్ మొతేరా క్రికెట్ స్టేడియానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు ఉండేది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించిన తర్వాత దానికి నరేంద్రమోదీ పేరు పెట్టారు. ఇప్పుడిదే రచ్చకు కారణం అవుతోంది.
‘సర్దార్ సన్మాన్ సంకల్ప్ ఆందోళన్ సమితి’ పేరుతో పాటిదార్ సంఘాల పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియాల్లో ఒకటైన ఈ స్టేడియం ప్రస్తుతం ఎన్నికల ముందు గుజరాత్ లో హాట్ టాపిక్ గా మారింది. 2015లో పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి, హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనలు చేశాయి.ప్రస్తుతం ఈ గ్రూప్ కూడా స్టేడియం పేరు మార్చాలని డిమాండ్ చేస్తోంది. ఆందోళలు, నిరసనల్లో పాల్గొననుంది.
ఆదివారం బర్డోలి సూరత్ లోని స్వరాజ్ ఆశ్రమం నుంచి అహ్మదాబాద్ లోని స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. సోమవారం సాయంత్రం స్టేడియానికి చేరుకుని గేట్ నం 1 ముందు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రభుత్వం పేరు మార్చకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల ముందు పటేల్ భారీ విగ్రహం నిర్మించారు.. అనంతరం స్టేడియం పేరు మార్చారని బీజేపీని విమర్శించారు. అయితే ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలను అనుమతించమని పాటీదార్ సంఘాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు.