దేశంలో ఫుడ్ డెలవరీ బిజినెస్ ఆపరేటర్లు పెరిగిపోతున్నారు. స్విగ్గీ, జొమాటోతో పాటు మరికొన్ని సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. బిజీ షెడ్యూల్ వల్ల ఫుడ్ డెలవరీ ఆపరేటర్లకు భలే గిరాకీ పెరిగింది. కొన్నాళ్లుగా మెట్రోలు, ప్రధాన నగరాలకే పరిమితం అయిన ఫుడ్ డెలవరీ రంగం ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కస్టమర్ల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. అయితే వీటిని పరిష్కరించే మార్గాలను ఫుడ్ డెలవరీ ఆపరేటర్లు విస్మరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి.
తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్స్( వినియోగదారుల వ్యహహారాల విభాగం) స్విగ్గీ, జొమాటో వంటి ఇ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి 15 రోజుల్లో ప్రతిపాదనలు అందించాలని ఆదేశించింది. డిపార్ట్మెంట్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ (1915)కి గత ఏడాది కాలంలో స్విగ్గీపైన 3631 ఫిర్యాదులు నమోదు కాగా.. జొమాటో పై 2828 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. తాజాగా జరిగిన ఈ సమావేశంలో ప్రధాన సమస్యలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఫిర్యాదుల్లో ఎక్కువగా డెలవరీ, ప్యాకింగ్ ఛార్జీల విషయంలో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు రెస్టారెంట్ ద్వారా ఆర్డర్ చేసే సమయంలో వినియోగదారుడికి చూపించే డెలివరీ సమయం, డెలివరీ చేసే సమయంల వాస్తవానికి దూరంగా ఉంటుందని.. ఇదే సమయంలో ఆహార పదార్థాల ధర, పరిమాణాల్లో కూడా తేడాలు ఉంటున్నట్లు వినియోగదారులు ఫిర్యాదుల్లో చేస్తున్నారని సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.
అయితే ఇ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు వినియోగదారుల సమస్యలను రెస్టారెంట్లతో పంచుకోవడం లేదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( ఎన్ఆర్ఏఐ) ఆరోపించింది. ఫుడ్ డెలివరీ ఛార్జీలు పుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్స్ ద్వారానే నిర్ణయించబడుతాయని, వసూలు చేయబడతాయని పేర్కొన్నారు. అయితే ఆర్డర్ మొత్తంలో డెలివరీ ఛార్జీలు, ప్యాకేజింగ్ చార్జీలు, పన్నులు మొదలైనవి వినియోగదారుడికి పారదర్శకంగా చూపించాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.
