పసుపు రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం నుంచి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. పసుపు బోర్డు తెలుగు రాష్ట్రాలకే కాదని.. యావత్తు దేశానికి అందిస్తుందన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ దీన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ.. గ్రామాల పండుగ అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఈ తరం మరిచిపోకుండా.. పండుగ నాడు తమ స్వస్థలాలకు వెళ్లి మరీ జరుపుకోవడం శుభసూచకం అన్నారు. ఢిల్లీలో తొలిసారి తన నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రధాని మోడీ, స్పీకర్ ఓంబిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కవులు, కళాకారులు పాల్గొన్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ వేడుకల్లో స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు, సినీనటుడు చిరంజీవి, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, పీవీ సింధు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను మోడీ వీక్షించారు. ప్రధాని మోడీకి వెంకటేశ్వరస్వామి ప్రతిమను కిషన్‌రెడ్డి అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తన సహచర మంత్రివర్గ సభ్యుడు కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలకు హాజరైనట్లు పేర్కొన్నాు. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను చూసి ఆనందించినట్లు చెప్పారు. దేశ ప్రజలంతా ఆనందం, మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
ఇక జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.