Site icon NTV Telugu

President Kovind: పద్మశ్రీ అవార్డు అందుకున్న గరికపాటి నరసింహారావు

దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం నాడు పద్మ పురస్కారాల ప్రదానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పద్మ అవార్డుల విజేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచన కర్త, ఏపీకి చెందిన గరికపాటి నరసింహారావు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న వారి జాబితాలో మొగులయ్య కూడా ఉన్నారు.

మరోవైపు భారత తొలి సీడీఎస్ జనరల్​బిపిన్ రావత్‌కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్​ప్రకటించగా.. ఈ పురస్కారాన్ని ఆయన కుమార్తెలు క్రితిక, తరణి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్​నేత గులాం నబీ ఆజాద్‌కు​పద్మ భూషణ్​అవార్డు దక్కింది. విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల మొత్తం 128 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించగా.. నలుగురిని పద్మ విభూషణ్‌.. 17 మందిని పద్మభూషణ్‌, 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. రెండో విడత అవార్డుల ప్రదానం ఈనెల 28న జరగనుంది.

Exit mobile version