NTV Telugu Site icon

Middle East effect: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

Middleeasteffect

Middleeasteffect

త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చని అంతా భావించారు. త్వరలోనే చమురు కంపెనీలు శుభవార్త కూడా చెప్పొచ్చని వార్తలు వినిపించాయి. వాహనదారులు కూడా గుడ్‌న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పశ్చిమాసియా యుద్ధ వాతావరణంతో ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇంధన ధరల తగ్గింపు అసంభవం అని నివేదికలు అందుతున్నాయి. మరోవైపు ఇరాన్ చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చని అగ్ర రాజ్యం అమెరికాతో పాటు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కి కూర్చుంటాయి.

ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెండ్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 75 డాలర్ల మార్క్‌ను దాటింది. బెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ క్రూడ్‌ సైతం 72 డాలర్లకు చేరింది. వాస్తవానికి ఇటీవల క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పతనమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్‌లో చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆయిల్‌ సరఫరాపై పెను ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఈ క్రమంలోనే ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరింది. గత రెండు, మూడు రోజుల్లో చమురు ధరలు 5 శాతం వరకు పెరిగాయి. ఇరాన్‌ రోజుకు 1.5 మిలియన్‌ బ్యారెల్స్‌ ఉత్పత్తి చేస్తోంది. చమురు కేంద్రాలు ధ్వంసం అయితే ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

భవిష్యత్‌లో ఇంధన ధరలు తగ్గించడం కష్ట సాధ్యమని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. చమురు ధరలు పెరుగుతాయి తప్ప తగ్గవని ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో జమ్మూకాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కారణంగా ధరలు పెంచలేదు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.48కి పెంచారు. ఇక త్వరలో ఇంధన ధరలు కూడా పెరిగే ఛాన్సు ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే పెరుగుతున్న ముడిచమురు ధరలు కారణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సహా భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు పడిపోయాయి. దీంతో భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. త్వరలో ఈ బరువు తగ్గించుకునేందుకు కంపెనీలు కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి.