New Criminal Laws: బ్రిటీష్ కాలపు వలస చట్టాల స్థానంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 న్యాయ చట్టాలను తీసుకువచ్చింది. భారతీయ న్యాయ సంహిత-2023 శతాబ్ధం నాటి భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) స్థానంలో రాబోతోంది. జూలై 1 నుంచి అమలులోకి రాబోతున్న కొత్త చట్టం ఐపీసీని 511 నుంచి 358 సెక్షన్లకు తగ్గించి, 20 నేరాలను జోడించింది. క్రిమినల్ చట్టాల్లో చాలా మార్పులు తీసుకువచ్చింది.
గతంలో అత్యాచారం, హత్యలు చేసినా, ఉగ్రవాదానికి పాల్పడినా నిందితుల్లో భయం ఉండేది కాదు, చట్టాలను అడ్డుపెట్టుకుని కొన్నేళ్లలో బయటకు రావచ్చనే ధీమా వారిలో ఉండేది. అయితే, ఇక ఇలాంటి నేరాలకు ఇప్పుడు కఠినమైన శిక్షలు పడనున్నాయి.
1) మహిళలు, పిల్లలపై నేరాలు
18 ఏళ్ల లోపు మహిళలపై అత్యాచారాలకు సంబంధించి నిబంధనలను సవరించారు. మైనర్‌పై గ్యాంగ్ రేప్ కోసం పోక్సోతో స్థిరమైన నిబంధనలు ఉన్నాయి.
18 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం చేస్తే జీవితఖైదు, మరణశిక్ష విధింపు. కొత్తగా క్రైమ్ కేటగిరీలో 18 ఏళ్లలోపు మహిళపై సామూహిక అత్యాచారాన్ని తీసుకువచ్చారు.
మోసపూరిత లైంగిక కార్యకలాపాలు లేదా వివాహానికి సంబంధించిన తప్పుడు వాగ్దానాలను లక్ష్యంగా చేసుకుంటూ శిక్షలతో పాటు భారీ జరిమానాలు విధించనున్నారు.
2) తీవ్రవాదం
సెక్షన్ 113(1) ప్రకారం ఉగ్రవాదం శిక్షార్హమైన నేరం అవుతుంది. ఉగ్రవాద చర్యలకు పెరోల్ లేకుండా మరణశిక్ష లేదా జీవిత ఖైదు.
పబ్లిక్ సౌకర్యాలు, ప్రైవేట్ ఆస్తిని నాశనం చేయడం వంటివి కొత్త నేరాల్లో చేర్చారు. డ్యామేజీ చేస్తే దానికి నష్టపరిహారం వసూలు చేయడం వంటివి తీసుకువచ్చారు.
3) దేశ ద్రోహం:
భారత దేశ సార్వభౌమత్వ, ఐక్యత, సమగ్రతకు అపాయం కలిగించే విద్రోహానికి సంబంధించి ఐపీసీ 124 ఏని, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152 మార్చారు. భావప్రకటన స్వేచ్ఛను రక్షిస్తూనే.. సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, వేర్పాటువాద కార్యకలాపాలను చేర్చారు.
4) వ్యవస్థీకృత నేరం:
భారతీయ న్యాయ సంహితలో వ్యవస్థీకృత నేరాలపై కొత్త విభాగం పరిచయం చేశారు. సెక్షన్ 111(1)లో వ్యవస్థీకృత నేర నిర్వచనాన్ని చెబుతుంది. సిండికేట్-సంబంధిత చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఇప్పుడు శిక్షార్హమైనవి. సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు మరియు వ్యవస్థీకృత నేరాల కింద సార్వభౌమత్వాన్ని బెదిరించే చర్యలు ఇప్పుడు వ్యవస్థీకృత నేరాల్లో ఉన్నాయి. వివిధ నేరాలకు మరణశిక్ష, జైలు శిక్ష, జరిమానాతో సహా శిక్షలు విధించనున్నారు.
ఇతర ముఖ్యమైన నిబంధనలు:
మూకదాడికి కొత్త నిబంధనలు చేర్చారు. యావజ్జీవ కారాగార శిక్ష, మరణశిక్షలు ఉంటాయి. వైకల్యం, శాశ్వత వైకల్యానికి దారి తీస్తే భారీ జరిమానాలు విధిస్తారు. జీరో ఎఫ్ఐఆర్ దాఖలు ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతిస్తుంది.
