Sandeshkhali: లోక్‌సభ ఎన్నికల ముందు బెంగాల్ లోని సందేశ్‌ఖాలీ చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలన్నీ దీని చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా సందేశ్‌ఖాలీ మరోసారి టెన్షన్ నెలకొంది. ఈ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకున్న నిరసనల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తపై బీజేపీ మద్దతుదారులు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణమూల్ ఎమ్మెల్యే సుకుమార్ మహతా సహాయకుడు టాటాన్ గయెన్‌పై స్థానిక పోలీస్ స్టేషన్ నుండి రాళ్ల దాడి జరిగింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అల్లర్లను నియంత్రించారు. టీఎంసీ ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు బనాయిస్తోందని బీజేపీ నేతలు నిరసన చేపట్టారు.
మాజీ టీఎంసీ నేత షేక్ షాజహాన్ సందేశ్‌కాలీలోని మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జా, దోపిడికి పాల్పడిన ఉదంతం తెరపైకి రావడంతో ఈ ప్రాంతంలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు రేషన్ కుంభకోణంలో విచారణకు వెళ్లిన ఈడీ అధికారులపై ఇతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత 55 రోజుల పాటు పరారీలో ఉన్న ఇతడిని కలకత్తా హైకోర్టు అల్టిమేటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది.
Read Also: Romances on a Bike: బైక్‌పై రొమాన్స్ చేస్తూ ఎస్పీకి పట్టుబడ్డ జంట.. వీడియో వైరల్..
ఇదిలా ఉంటే ఈ కేసులో ఇటీవల ట్విస్ట్ చోటు చేసుకుంది. సందేశ్‌ఖాలీలో ఎలాంటి అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగలేదని, బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి సూచన మేరకు మహిళలు ఫిర్యాదు చేయడానికి ఒప్పించామని స్థానిక బీజేపీ నేత గంగాధర్ కోయల్ చెప్పిన వీడియో వైరల్ అయింది.
బీజేపీ కార్యకర్తలు ఈరోజు స్థానిక పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకు దిగారు. నకిలీ వీడియోలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపిస్తున్న స్థానిక తృణమూల్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులలో బసిర్‌హత్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి సందేశ్‌ఖాలీ నివాసి రేఖా పాత్ర కూడా ఉన్నారు. టీఎంసీ ఓడిపోతోందని తమన వేధిస్తోందని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. \
