రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బాధిత బాలికపై ఐదు రోజుల పాటు 30 మందికి పైగా వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్‌కు దిగింది. కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు హోటళ్లను బుల్డోజర్లతో కూల్చివేసింది. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హరిశంకర్ హామీ ఇచ్చారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 18న ఇంటి నుంచి అదృశ్యమైన బాలికను ఓ ఆటోరిక్షా డ్రైవర్ స్థానిక హోటల్ యజమానికి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఐదు రోజుల పాటు నగరంలోని పలు హోటళ్లకు తరలిస్తూ 30 మందికి పైగా వ్యక్తులు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. పలువురు హోటల్ యజమానులు, నిర్వాహకులు కూడా ఈ ఘోరానికి సహకరించడమే కాకుండా.. జరిగిన నేరాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలంలో.. నొప్పితో ఏడుస్తుంటే తనకు బలవంతంగా మద్యం తాగించేవారని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ప్రజల్లో ఆగ్రహం.. ఉరిశిక్ష డిమాండ్
ఈ అమానుష ఘటనపై శ్రీగంగానగర్ జిల్లాలో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలని, అక్రమంగా నిర్మించిన హోటళ్లన్నింటినీ కూల్చివేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. మరోవైపు స్థానిక కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి.. ఈ ఘటనను అడ్డుకోవడంలో పరిపాలన విఫలమైందని ఆరోపించింది. కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.

