Site icon NTV Telugu

Selfie Tragedy: సెల్ఫీ మోజులో నలుగురు యువతులు బలి

Selfie Tragedy

Selfie Tragedy

Selfie Tragedy: ప్రస్తుతం ఎక్కడ చూసినా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. మొబైల్ చేతిలో ఉండటంతో యువత ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి సెల్ఫీల మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో నలుగురు యువతుల సెల్ఫీ మోజు వారి ప్రాణాలను బలి తీసుకుంది. బెళగావి జిల్లాలో శనివారం మధ్యాహ్నం వాటర్ ఫాల్‌ వద్ద నలుగురు యువతులు సెల్ఫీ తీసుకుంటుండగా నీళ్లలో జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 40 మంది విద్యార్థుల బృందం కర్ణాటక సరిహద్దులోని కితవాడ జలపాతానికి విహారయాత్రకు వెళ్లారు. వారిలో ఐదుగురు యువతులు సెల్ఫీ తీసుకుంటూ వాటర్‌ఫాల్స్‌లో పడిపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు యువతులు ప్రాణాలు కోల్పోగా మరో యువతి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంది.

మృతులను బెళగావిలోని ఉజ్వల్ నగర్‌కు చెందిన అసియా ముజావర్ (17), అంగోల్‌కు చెందిన కుద్షియా హసన్ పటేల్ (20), రుఖ్‌సర్ భిస్తీ (20), బెలగావిలోని జత్‌పత్ కాలనీకి చెందిన తస్మియాగా అధికారులు గుర్తించారు, వీరంతా బెళగావిలోని కామత్ గల్లి వద్ద ఉన్న మదర్సా విద్యార్థులు అని తెలిపారు. అయితే యువతులు నీటిలో పడిపోగానే వాళ్లను కాపాడేందుకు అక్కడ ఉన్న వారికి ఈత రాకపోవడంతో రక్షించలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాలికను ఎలాగోలా రక్షించి ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఆసుపత్రి వైద్యులు చెప్పారని స్థానికులు వెల్లడించారు.

Read Also: Rashmi Gautham: బికినీలో రష్మీ.. వీడియో వైరల్

అటు ఈ దుర్ఘటన గురించి తెలుసుకుని బెళగావి జిల్లా ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆస్పత్రి ప్రాంగణం చుట్టూ పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర, బిమ్స్ ఆసుపత్రి సర్జన్ అన్నాసాహెబ్ పాటిల్ ఆసుపత్రికి చేరుకున్నారు.

Exit mobile version