NTV Telugu Site icon

Champai Soren: కమలం గూటికి చేరిన జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్

Champaisoren

Champaisoren

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేఎంఎం మాజీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీ గూటికి చేరారు. రాజధాని రాంచీలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో చంపై సోరెన్ బీజేపీలో చేరారు.

బుధవారం జేఎంఎం పార్టీకి చంపై సోరెన్ రాజీనామా చేశారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న పనితీరు, విధానాలు పట్ల బాధపడుతున్నట్లు చెప్పారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని ఆయన అన్నారు. చంపై.. ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. జార్ఖండ్ మోర్చా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అన్ని పదవులకు రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. గిరిజనులు, దళితుల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.

మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జైలుకెళ్లారు. ఆ తర్వాత ఆయన స్థానంలో జేఎంఎం పార్టీలో సీనియర్ నాయకుడైన చంపై సోరెన్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే హేమంత్‌కు బెయిల్ లభించడంతో తిరిగి చంపైను తప్పించి.. హేమంత్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలే చంపై సోరెన్‌ను బాధపెట్టినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరిలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమిలు తలపడబోతున్నాయి. ఈసారి అధికారం ఎవరికి దక్కనుందో చూడాలి.