Site icon NTV Telugu

వరద బీభత్సం : సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఆస్పత్రులు, కార్యాలయాలకు నీళ్లు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.పశ్చిమబెంగాల్‌లోని బిర్‌భూమ్‌, బంకురా, వెస్ట్‌మిడ్నాపూర్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. బిర్‌భూమ్‌లోని ప్రముఖ కంకాలితాల ఆలయం నీట మునిగింది. బంకురా జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

రాజస్థాన్‌లోనూ భారీ వరదలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ధోల్‌పూర్‌లో పార్వతీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో కాజ్‌వేపై దాటేందుకు ప్రయత్నించిన ఓ సిలిండర్‌ ట్రక్‌.. నీటిలో చిక్కుకుపోయింది. స్థానికులంతా దాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో వర్షాలు ముంచెత్తాయి. నదుల ప్రవాహం పెరగడంతో… పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిక్కింలో వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లోనూ జోరుగా వానలు పడుతున్నాయి.

Exit mobile version