Delhi Floods: నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యమునా నది ఉప్పొంది ప్రవహిస్తోంది. యమునా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నగరంలోని రోడ్లన్ని జలమయం అయ్యాయి. చివరికి సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి సైతం వరద నీరు చేరింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైన్యం సహాయం కోరారు.
Read also: Minister RK Roja: త్వరలోనే చంద్రబాబు అరెస్ట్.. సింగపూర్‌లో చిప్పకూడు పెడతారు..!
యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఢిల్లీలో ప్రధాన ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. డ్రెయిన్ రెగ్యులేటర్ పాడవడంతో ఐటీఓ క్రాసింగ్ ఏరియాతోపాటు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి యమునా నది వరద నీరు పారుతోంది. దీంతో అప్రమత్తమైన సీఎం కేజ్రీవాల్.. ఆర్మీ సహాయం కోరాలని అధికారులకు ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ సహాయం తీసుకుని రెగ్యులేటర్‌ను సరిచేయాలని కోరారు. ఇందుకోసం ఇంజినీరు బృందాలు రాత్రంతా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. ఇంద్రప్రస్తా బస్ డిపో నుంచి డబ‍్ల్యూహెచ్‌ఓ బిల్డింగ్ మధ్య ఉండే డ్రెయిన్ రెగ్యులేటర్ పాడయిపోయిన కారణంగా వరద ఉద్దృతి ఈ ప్రాంతానికి చేరినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాగా.. ఐటీఓ క్రాసింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ పోల్స్‌కు షాక్ వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో ఉప్పొంగిన యమునా నది ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్న యమునా నది 208.46 మీటర్ల మేర ప్రవహించింది. కానీ ఈ రోజు మధ్యాహ్నానానికి 208.30కు తగ్గుతుందని కేంద్ర వాటర్ కమిషన్ అంచనా వేసింది. ఇప్పటికే వరద నీరు ఏకంగా ఢిల్లీ నడిబొడ్డున ఉన్న తిలక్ మార్గ్‌లోని సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఢిల్లీలో వరద నేపథ్యంలో ఫ్రాన్స్‌లో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పరిస్థితి తీవ్రతను సమీక్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటిమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పాఠశాలలకు, ఆఫీసులకు సెలువులు ప్రకటించారు.
