సైనిక రిక్రూట్ మెంట్ కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీం కింద త్రివిధ దళాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇండియన్ నేవీలో అగ్నివీర్ సైలర్ పోస్టుల్లో 20 శాతం మంది మహిళలు ఉండనున్నారు. సైలర్ ఉద్యోగాల్లో మహిళలను భర్తీ చేయడం ఇదే ప్రథమం. అగ్నిపథ్ పథకం అమల్లోకి వచ్చిన తరువాత మొదటి బ్యాచ్‌లో 3,000 మంది సైలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్టు నేవీ అధికారులు వెల్లడించారు. నావికా దళం ప్రకటించిన అర్హతలను వారు చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వారిని ఈ దళంలో వేర్వేరు శాఖలకు కేటాయించనున్నారు.
Agnipath Scheme: ఏపీలోని 13 జిల్లాల నిరుద్యోగులకు గమనిక.. విశాఖలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
ఈ పోస్టుల కోసం ఇంతవరకు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తొలిసారి నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. అవసరమైతే వారిని యుద్ధనౌకల్లోనూ విధులకు పంపనున్నట్లు పేర్కొంది. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నియామకాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ పథకం కింద వాయుసేనలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవ్వగా.. దాదాపు 3లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 1 నుంచి నేవీ, ఆర్మీల్లోనూ ఈ పథకం కింద నియామక ప్రక్రియ మొదలైంది.