న్యూఢిల్లీలో కోరల్ బాగ్‌లోని గఫార్ మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి క్రమంగా అవి మార్కెట్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. అయితే ఇది గమనించిన స్థానికులు పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 39 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మరోచోట ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని ఘజియాబాద్‌లో పారిశ్రామిక వాడలో ఉన్న సబ్బుల పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అయితే ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. కానీ ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
