Women Harassment: కోల్‌కతాలో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధితురాలికి న్యాయం కోసం మహిళలు, తోటి వైద్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసుల అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం నిందితులను కాపాడుతుందా..? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలోని సెమినార్ హాలులో అత్యాచారం జరిగింది. అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసుని సీబీఐకి బదిలీ చేసింది.
ఇది ఒక్క ఘటనే కాదు దేశవ్యాప్తంగా అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో 2017 నుంచి 2022 మధ్య సగటున ప్రతీరోజూ 86 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. చాలా కేసుల్లో మహిళలు తమకు తెలిసిన వారి నుంచే అఘాయిత్యాలకు గురికావడం గమనార్హం. ఈ ప్రకారం చూస్తే దేశంలో ప్రతీ గంటకు నలుగురు మహిళలు రేప్‌కి గురవుతున్నారు. ఇందులో మూడు కంటే ఎక్కువ అత్యాచారాల్లో బాధిత మహిళలకు నిందితులు తెలుసు.
Read Also: UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి!
వార్షిక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం, 2017 మరియు 2022 మధ్య, భారతదేశంలో మొత్తం 1.89 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి, ఇందులో 1.91 లక్షల మంది బాధితులు ఉన్నారు. కనీసం 1.79 లక్షల కేసుల్లో రేపిస్ట్ తెలిసిన వ్యక్తి కాగా, 9,670 కేసుల్లో బాధితురాళ్లకు తెలియదు. భారతదేశంలో అత్యధికంగా అత్యాచారా బాధితుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యే ఉంది. 1.89 లక్షల కేసుల్లో 1.13 లక్షల మంది ఈ వయసువారే. ఈ లెక్కన చూస్తే ప్రతీ రోజూ నమోదవుతున్న 86 అత్యాచారాల్లో 52 మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలే. మిగిలిన కేసుల్లో బాధితురాళ్ల వయసు 30 కన్నా ఎక్కువ ఉంటుంది.
మన ఆఫీసులు, పని ప్రదేశాలు ఎంత భద్రం..?
భారతదేశంలో నమోదవుతున్న కేసులతో పోలిస్తే ఆఫీసుల్లో మహిళలపై లైంగిక వేధింపులు తక్కువగానే ఉన్నప్పటికీ, వీటిని లైట్ తీసుకునే అవకాశం లేదు. సగటున ప్రతీరోజై కనీసం ఒక మహిళ తన ఆఫీసులో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న NCRB డేటా చూపిస్తుంది. 2014 మరియు 2022 మధ్య, పని లేదా కార్యాలయ ప్రాంగణంలో లైంగిక వేధింపులకు సంబంధించి కనీసం 4,231 కేసులు నమోదయ్యాయి. మొదట్లో, ఆఫీసు ప్రాంగణాల్లో లైంగిక వేధింపుల కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే మిగత పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అధికంగా ఉన్నాయి. 2014, 2015 మరియు 2016 సంవత్సరాల్లో, యజమానులు లేదా సహోద్యోగులు చేసిన అత్యాచారాల సంఖ్యను కూడా NCRB వెల్లడించింది. మూడు సంవత్సరాలలో, యజమానులు లేదా సహోద్యోగులచే 1,795 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతీ రోజూ దాదాపుగా ఇద్దరిపై అత్యచారం జరిగినట్లు డేటా చూపిస్తోంది.