BMW M4 Competition: 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు.. కొడుకుకు రూ.1.62 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!

Father Gifts

Father Gifts

BMW M4 Competition Gift: పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే ఖరీదైన బహుమతులు ఇవ్వడం సాధారణమే. అయితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన 15 ఏళ్ల కుమారుడికి ఏకంగా రూ.1.62 కోట్ల విలువైన BMW M4 Competition కారును బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. 9వ తరగతి అర్ధ సంవత్సర పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందుకు ఈ ఖరీదైన కారును కానుకగా అందించారు.

పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో గల గల్సీ ప్రాంతం పరాజ్ గ్రామానికి చెందిన షంసుద్దీన్ మిద్యా అనే వ్యాపారవేత్త తన కుమారుడు మొహమ్మద్ తల్హాకు ఈ కారును బహుమతిగా ఇచ్చారు. తనకు BMW M4 Competition కారు కావాలని తల్హా చాలాకాలంగా కోరుకుంటున్నాడు. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే ఆ కోరిక నెరవేరుస్తానని తండ్రి గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఫలితాలు వెలువడిన తర్వాత ముంబైలోని అంధేరీ షోరూమ్‌కు వెళ్లి కారును కొనుగోలు చేశారు.

ప్రత్యేక కంటైనర్‌లో గ్రామానికి చేరిన కారు

ముంబైలో కొనుగోలు చేసిన BMW M4 Competition కారును ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని పరాజ్ గ్రామానికి తరలించారు. నవంబర్ 6, శుక్రవారం గ్రామానికి కారు చేరుకోవడంతో దాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కుమారుడి కష్టానికి తగిన బహుమతి ఇచ్చిన తండ్రిని కొందరు ప్రశంసిస్తుండగా, 15 ఏళ్ల వయసులో ఉన్న విద్యార్థికి ఇంత ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

తండ్రి వద్ద ఇప్పటికే ఖరీదైన కార్ల కలెక్షన్

షంసుద్దీన్ మిద్యా వద్ద ఇప్పటికే పలు లగ్జరీ, ప్రీమియం కార్లు ఉన్నాయి. ఆయన కార్ల కలెక్షన్‌లో లేటెస్ట్ జనరేషన్ Range Rover Autobiography, Volvo XC90, Mercedes-Benz C-Class, Mahindra Thar Roxx, Hyundai Alcazar ఉన్నాయి. తాజాగా ఈ కలెక్షన్‌లో BMW M4 Competition కూడా చేరింది.

BMW M4 Competition ప్రత్యేకతలు

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW అందిస్తున్న అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్ కూపే కార్లలో M4 Competition ఒకటి. ఈ కారులో 3.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 530 bhp పవర్‌తో పాటు 650 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఈ కారు ప్రత్యేకతలు. BMW M4 Competition M xDrive కేవలం 3.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

దీని గరిష్ఠ వేగాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. డిజైన్ పరంగా కూడా ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పసుపు రంగు ఐకాన్లతో కూడిన హెడ్‌లైట్లు, కార్బన్ ఫైబర్ బానెట్, ఫ్రంట్ స్ప్లిటర్, మిర్రర్ క్యాప్స్, పెద్ద కిడ్నీ గ్రిల్, రియర్ డిఫ్యూజర్ వంటి అంశాలు స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి. కారు లోపల ప్రత్యేకమైన M కార్బన్ బకెట్ సీట్లు, ఇతర స్పోర్టీ డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి.