Kangana Ranaut: మండి ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ గురువారం చండీగఢ్ ఎయిర్‌పోర్టులో చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. ఈ విషయంలో ఇప్పటికే ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. రైతుల ఆందోళనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే తాను దాడి చేశానని కుల్విందర్ కౌర్ చెప్పారు. రూ. 100 తీసుకుని రైతులు ఆందోళనల్లో పాల్గొంటున్నారని కంగనా వ్యాఖ్యలు చేసిన సమయంలో తన తల్లి కూడా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొందని ఆమె అన్నారు.
Read Also: China: మోడీకి మెజారిటీ తగ్గడంపై చైనా ఫుల్ ఖుషీ.. ఎందుకు..?
మరోవైపు కంగనా ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ, తనపై దాడి జరిగిందని, తనను దుర్భాషలాడారని చెప్పింది. పంజాబ్‌లో పెరుగుతున్న తీవ్రవాదం, ఉగ్రవాదంపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారేలా కనిపిస్తోంది. కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ జూన్ 9న పంజాబ్ మొహాలీలో ఇన్సాఫ్ మార్చ్‌కి రైతు సంఘాలు ప్లాన్ చేస్తున్నాయి. విమానాశ్రయంలో ఈ ఘటనకు దారి తీసిన సంఘటనల క్రమంపై సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ రైతు సంఘాలైన సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) మరియు కిసాన్ మజ్దూర్ మోర్చా శుక్రవారం నాడు కుల్విందర్ కౌర్‌కు మద్దతు ప్రకటించాయి. SKM (నాన్ పొలిటికల్) నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మరియు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ ఈ విషయంపై సరైన విచారణ కోసం పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) గౌరవ్ యాదవ్‌ను కలవాలని యోచిస్తున్నారు. మహిళా కానిస్టేబుల్‌కి అన్యాయం జరగకూడదని కోరుతామని దల్లేవాల్ అన్నారు. కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యదర్శి షేర్ సింగ్ సోదరి. మరోవైపు సీఐఎస్ఎఫ్ కుల్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేసి, ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్యానెల్ ఏర్పాటు చేసింది.