Site icon NTV Telugu

Google Maps: గూగుల్ మ్యాప్స్‌ని ఫాలో అయ్యారు.. వరదలో చిక్కుకుపోయారు

Family Stuck In Floods

Family Stuck In Floods

Family Follows Google Maps Drove In Tamilnadu Floods: ఈమధ్య మనం గూగుల్ మ్యాప్స్‌ని ఎంతలా వాడుతున్నామో అందరికీ తెలుసు. ఒక తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు, సరైన లొకేషన్‌కి చేరుకోవడానికి ఈ గూగుల్ మ్యాప్సే మనకు సహాయపడుతుంది. ఎక్కడికి వెళ్లాలనుకున్నా సరే.. గూగుల్ మ్యాప్స్ ఉండగా, టెన్షన్ ఎందుకు దండగా అనుకుంటూ ముందడుగు వేస్తాం. కానీ.. కొన్నికొన్ని సార్లు ఈ గూగుల్ మ్యాప్స్ తప్పుడు లొకేషన్స్‌కి తీసుకు వెళ్తుంటుంది. షార్ట్ కట్ అని చెప్పి, ప్రమాదాల్లో నెట్టేస్తుంది. అందుకు నిదర్శనంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరో ఘటన జరిగింది. గూగుల్ మ్యాప్స్‌ని గుడ్డిగా నమ్మి తమ ప్రయాణం కొనసాగించిన ఓ కుటుంబం.. వరదల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. వారిని కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని సర్జాపూర్‌కు చెందిన రాజేశ్ కుటుంబం, ఇటీవల హోసూర్‌కి వెళ్లింది. అక్కడ తమ పనులు ముగించుకున్న తర్వాత.. తిరిగి స్వగ్రామానికి బయలుదేరింది. అయితే.. తిరుగు పయనంలో రాకేష్ గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నాడు. అది చూపించిన దారిలోనే పయనమయ్యాడు. అలా తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని బాగేపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అక్కడి పరిస్థితులు బాగోలేనప్పటికీ, అది గమనించకుండా గూగుల్ మ్యాప్స్‌ని నమ్మి ముందుకెళ్లాడు. తీరా వాళ్లు భారీ వరదలో చిక్కుకున్నారు. తన కారును వెనక్కు తిప్పేందుకు రాజేష్ సాయశక్తులా ప్రయత్నించాడు కానీ, సాధ్యం కాలేదు. అప్పుడతను వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో.. వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ క్రేన్లను ఉపయోగించి.. వరదలో చిక్కుకున్న కారుని బయటకు తీసి, అతని కుటుంబాన్ని రక్షించారు.

Exit mobile version