Site icon NTV Telugu

Joshimath Sinking: కుంగిపోతున్న జోషిమఠ్ పట్టణం.. కారణాలు ఇవే అంటున్న నిపుణులు

Joshimat Sinking

Joshimat Sinking

Causes of Joshimath Sinking: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల్లో ఉన్న జోషిమఠ్ పట్టణం కుంగిపోతోంది. అక్కడి ఇప్పటికే 500కు పైగా ఇళ్లు బీటలువారాయి. రోడ్లు కోతలకు గురువుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలను ఆ ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతానికి తరలిస్తోంది. శనివారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పట్టణంలో పర్యటించారు. ప్రజలకు పునరావాసం కల్పించడంతో కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లను సిద్ధం చేసింది ప్రభుత్వం.

ఇదిలా ఉంటే జోషిమఠ్ కుంగిపోవడానికి కారణాలు అనేకం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ కాలాచంద్ సైన్ ఈ విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలు జోషిమఠ్ కుంగుబాటుకు కారణం అవుతున్నాయని అన్నారు. దాదాపుగా 100 ఏళ్ల క్రితం భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం ఈ కొండచరియల పైనే జోషిమఠ్ పట్టణం ఏర్పడింది. దీంతో పాటు ఈ పట్టణం భూకంపాలు ఎక్కువగా వచ్చే సెస్మిస్ జోన్-5లో ఉంది. దీనికి తోడు వాతావరణం, నీటి ప్రవాహాలు అక్కడి నేలపై, శిలల బంధన బలాలపై ప్రభావం చూపిస్తున్నాయి.

Read Also: VBIT College : విద్యార్థినుల ఫోటో మార్ఫింగ్ కేసు.. ఆ నలుగురే నిందితులు

1886లో హిమాలయన్ గెజిటీర్ లో అట్కిన్స్ కొండచరియాలు విరిగిపడిన శిథిలాల మీద జోషిమఠ్ ఉందని ప్రస్తావించారు. ఆ తరువాత 1976లో మిశ్రా కమిటీ జోషిమఠ్ ను ప్రస్తావించింది. గత ఏడాది రిషిగంగా, ధౌలిగంగ నదులకు భారీగా వరదలు సంభవించాయి. ఈ వరదలు, వాతావరణ జోషిమఠ్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాలకు నేల నుంచి సహకారం లభించాలి..కానీ జోషిమఠ్ లో ఈ పరిస్థితి లేదు. కొండచరియలు తక్కువ బేరింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయి. ఇది అధిక నిర్మాణ రేటుకు మద్దతు ఇవ్వదని నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. పెరిగిన నిర్మాణాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, జాతీయ రహదారి విస్తరణ గత రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని అస్థిరంగా మార్చింది.

జోషిమత్ బద్రీనాథ్‌కి గేట్‌వే ఉండటంతో పాటు ఈ ప్రాంతం సైనికంగా వ్యూహాత్మకంగా ఉంది. దీంతో అక్కడ ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు, హోటళ్లు పుట్టుకొచ్చాయి. ఇది కూడా అక్కడి నేలను మరింత బలహీనంగా మార్చినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు హిమాలయ ప్రాంతంలో భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల ఆక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ప్రతీ ఏడాది ఒక సెంటీమీటర్ చొోప్పున ఇండియా భూభాగం ఉత్తరానికి కదులుతూ, ఆసియా టెక్టానిక్ ప్లేట్ ను తోస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. ఇవన్నీ కలిసి జోషిమఠ్ ను కుంగిపోయేలా చేస్తున్నాయి.

Exit mobile version