Site icon NTV Telugu

Rains And Floods: ఢిల్లో వరదలు తగ్గినా.. వర్షాలు తగ్గలేదు.. ప్రమాదకర స్థాయిలోనే యమునా

Rains And Floods

Rains And Floods

Rains And Floods: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు అన్నట్టుగా మారింది దేశ రాజధాని ఢిల్లీలోని వరదల పరిస్థితి. యమునా నది ప్రవాహం కొంత మేరకు తగ్గినప్పటికీ.. వర్షాలు తగ్గకపోవడంతో .. ఢిల్లీ ప్రజలు ఇంకా వరద నీటి నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఢిల్లీలో వరదలు శాంతించినా.. వర్షభయం మాత్రం వీడలేదు. శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉత్తర భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలు తగ్గుముఖం పట్టినా.. పరిస్థితి ఇప్పుడే సాధారణ స్థితికి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

Read also: Raju Gari Kodi Pulao: ఆకట్టుకుంటున్న “రాజుగారి కోడిపులావ్” ట్రైలర్

ఢిల్లీని ముంచెత్తిన వరద ప్రవాహం శనివారం కాస్త నెమ్మదించింది. కానీ రాత్రి భారీ వర్షం కురియడంతో మరోసారి వరద ముంచెత్తుతుందని ఢిల్లీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం ఉదయానికి యమునా నీటి మట్టం 205.98 మీటర్లకు తగ్గింది. వాస్తవానికి ప్రమాదకర నీటి మట్టమైన 205.33 కంటే ఇది ఎక్కువే. ఇకపై వర్షాలు లేకపోతే నేటి రాత్రికి ఇది 205.75కు తగ్గవచ్చని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ఢిల్లీ పరిస్థితిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాతో మాట్లాడి పరిస్థితి తెలుసుకొన్నారు. ఆ విషయాన్ని గవర్నర్‌ సక్సేనా ట్విటర్‌లో వెల్లడించారు. మరోవైపు యుమునా బ్యారేజీలో మొరాయిస్తున్న ఐదు గేట్లను తెరిచేందుకు యత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. యమున ప్రవాహం తగ్గిందని.. త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుతుందని ఆయన వెల్లడించారు. చాలా మంది ప్రజలు తిరిగి తమ గృహాలకు చేరుకుంటున్నారని.. మరోవైపు యమునా తీరాన ఉన్న మెట్రోస్టేషన్‌ను తెరిచినట్లు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.

Read also: Viajayanagaram: ఉపాధ్యాయుడు కృష్ణ హత్యకేసు.. ఉద్దవోలులో ఉద్రిక్తత

ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో 10 మంది వరదల కారణంగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. నొయిడాలోని దనాకౌర్‌ ప్రాంతంలో ఇద్దరు యువకులు యమునా ప్రవాహంలో కొట్టుకుపోయారు. యూపీలోని గౌతమ్‌ బుద్ధానగర్‌లో వరద తీవ్రత కొనసాగుతోంది. ఇక ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యుమున ప్రవాహాలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో వరదల కారణంగా రూ.8 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. రాష్ట్రంలోని పలు మౌలిక వసతులను.. మెరుపు వరదలు ధ్వంసం చేశాయి. అస్సాంలో విశ్వనాథ్‌ సబ్‌డివిజన్‌లో వరద తీవ్రత కొనసాగుతోంది. దాదాపు 32,400 మందిపై దీని ప్రభావం పడింది. 47 గ్రామాలు నీట మునగగా.. 858 హెక్టార్ల మేర పంట దెబ్బతింది. తాజాగా దాదాపు 6,600 మంది అమర్‌నాథ్‌ యాత్రికులు జమ్మూ నగరం నుంచి దర్శనానికి బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరు పహల్గాం, బల్తల్‌ క్యాంపులకు వెళ్లనున్నారు. ఉత్తరాఖండ్‌లో చమోలీ జిల్లాలో బద్రీనాథ్‌ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఎన్‌హెచ్‌-109 జాతీయ రహదారి.. దాదాపు ఏడు చోట్ల మూతపడిందని అధికారులు పేర్కొన్నారు.
రాజస్థాన్‌లోని మొత్తం 33 జిల్లాలకుగాను.. 15 జిల్లాల్లో ఈ సారి అసాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్క జిల్లాలో కూడా సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version