NTV Telugu Site icon

Emergency: “ఎమర్జెన్సీ” విధించిన రోజుని ‘సంవిధాన్ హత్యా దివాస్’గా పాటించాలని కేంద్రం నిర్ణయం..

Indira Gandhi

Indira Gandhi

Emergency: 1975, జూన్ 25న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే ఈ జూన్ 25వ తేదీని ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’( రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు)గా పాటిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అమానవీయ బాధలను భరించిన వారందరి ధైర్యాన్ని జూన్ 25న స్మరించుకోవాలని అమిత్ షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘జూన్ 25, 1975న, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, నియంతృత్వ ఆలోచనా ధోరణిని ప్రదర్శించి, దేశంపై ఎమర్జెన్సీని విధించడం ద్వారా మన ప్రజాస్వామ్యం యొక్క ఆత్మపై దాడి చేశారు. ప్రతీ ఏడాది జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివాస్’గా పాటించాలి’’ అని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read Also: Bharateeyudu 2: విజయ్ మాల్యా, గాలి జనార్దన్ రెడ్డిలను టచ్ చేసిన శంకర్?

ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ‘ సంవిధాన్ బచావో’ అంటూ బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 18వ లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఇండియా కూటమి నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగాన్ని చేతబూని ప్రమాణస్వీకారం చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నుంచి తన చేతిలో రాజ్యాంగ ప్రతిని వెంట పెట్టుకుంటున్నారు. అయితే, దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ నేత, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించిన విషయాన్ని బీజేపీ హైలెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జూన్ 25ని రాజ్యాంగాన్ని హత్య చేసిన దినంగా ప్రకటించింది.