బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఈరోజు, రేపు బీహార్‌లో పర్యటించనున్నారు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్‌ఎస్ సంధు రెండ్రోజుల పాటు పాట్నాలో పర్యటించనున్నారు. శనివారం రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఎన్నికల సన్నద్ధతపై ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లాక.. వచ్చే వారం ఏదొక సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్‌పై మోడీ ప్రశంసలు.. కారణమిదే!
ఈరోజు ఉదయం 10 గంటలకు బీహార్‌లో గుర్తింపు పొందిన పలు జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. సమావేశానికి ప్రతి రాజకీయ పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధుల బృందాన్ని ఆహ్వానించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను, ఇతర సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్వీకరించనుంది.
ఇది కూడా చదవండి: Trump-Hamas: ట్రంప్ ప్లాన్‌పై హమాస్ సంచలన నిర్ణయం
ఇక సెప్టెంబర్ 30న ఎన్నికల సంఘం బీహార్ తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం బీహార్‌లో 7 కోట్ల 42 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అధికారికంగా ఈ జాబితాను ఈసీ విడుదల చేసింది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ గడువు 2025 నవంబర్ 22తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలాఖరు నాటికి లేదా నవంబర్ ప్రారంభంలోనైనా ఎన్నికలు ముగించాలని భావిస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 3 దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కసరత్తు చేస్తోంది.
