ఎల్‌నినో తీవ్రమవుతోందా? ఈ ఏడాది లోపు మరింత డేంజర్‌లోకి వెళ్లనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎల్‌నినో బలపడుతోందని.. 2026 చివరి నాటికి అత్యంత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు క్రమంగా బలపడుతున్నాయి. 2026 ద్వితీయార్థం నాటికి ఇది అత్యంత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం 90 శాతానికి పైగా ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, గాలుల దిశలో మార్పులు వంటి పరిణామాలు ఎల్‌నినో మరింత బలపడేందుకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా ఉండకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ తాజా అంచనా ప్రకారం.. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉష్ణోగ్రతలు గత నెలలో మరింత పెరిగాయి. ఎల్‌నినో బలపడుతున్నదనడానికి ఇది కీలక సంకేతంగా పరిగణిస్తున్నారు. భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి.
సముద్ర ఉపరితలంపై మాత్రమే కాకుండా.. సముద్రం లోతుల్లోనూ వెచ్చని నీరు విస్తరిస్తోంది. దీంతో రానున్న నెలల్లో ఎల్‌నినో మరింత తీవ్రంగా మారేందుకు అదనపు శక్తి లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటికే ఎల్‌నినో ప్రభావానికి సంబంధించిన మార్పులు కనిపిస్తున్నాయి. మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుండగా.. ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఉష్ణమండల ప్రాంతాల్లో గాలుల నమూనాల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
అంతర్జాతీయ వాతావరణ అంచనా సంస్థలు ఉపయోగించే క్లైమేట్ మోడల్స్ ప్రకారం.. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు 2026 చివరి వరకు మరింత బలపడే అవకాశం ఉంది. 2026 ద్వితీయార్థం నుంచి 2027 ప్రారంభం వరకు ఇది అత్యంత బలమైన వాతావరణ పరిస్థితిగా మారే అవకాశం 90 శాతానికి పైగా ఉన్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా.. ప్రస్తుత ఎల్‌నినో చారిత్రాత్మక స్థాయికి చేరే అవకాశం 69 శాతం ఉందని అంచనా వేస్తున్నారు. అలా జరిగితే 1950 నుంచి ఆధునిక రికార్డులు అందుబాటులోకి వచ్చిన తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్‌నినో ఘటనల సరసన ఇది నిలిచే అవకాశం ఉంది.
ఎల్‌నినో అంటే ఏమిటి?
పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర జలాలు సాధారణం కంటే అసాధారణంగా వేడెక్కినప్పుడు ఏర్పడే సహజ వాతావరణ పరిస్థితినే ఎల్‌నినో అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేయగలదు. ముఖ్యంగా వర్షపాతం, కరువులు, తీవ్ర ఉష్ణోగ్రతలు, వేడిగాలులు, తుఫానులపై దీని ప్రభావం ఉండొచ్చు. అయితే ఎల్‌నినో బలపడినంత మాత్రాన ప్రతి ప్రాంతంలో ఒకే రకమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. స్థానిక వాతావరణ పరిస్థితుల ఆధారంగా ప్రాంతాల వారీగా మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంతో కాలానుగుణ వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకునే దేశాలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. సెప్టెంబర్‌లో వెలువడే తాజా అంచనాలతో ఎల్‌నినో ఎంత తీవ్ర స్థాయికి చేరుకుంటుందనే దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

