NTV Telugu Site icon

National Herald Case: నిన్న ప్రశ్నలు.. నేడు దాడులు.. నెక్ట్స్ అదే!

Ed Raids On National Herald

Ed Raids On National Herald

ED raids National Herald assets in Delhi: మనీలాండరింగ్ కేసులో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ).. తాజాగా మంగళవారం నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని వార్తా సంస్థ కేంద్ర కార్యాలయంతో పాటు 12 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల తర్వాత ఆస్తుల్ని ఎటాయ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. తొలుత ఈ కేసులో ఈడీ రాహుల్ గాంధీని విచారించింది. ఐదు రోజుల పాటు ఏకంగా 150 ప్రశ్నలు సంధించింది. అదే సమయంలో సోనియా గాంధీని సైతం విచారణకు పిలిస్తే, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిపాలవ్వడంతో గ్యాప్ వచ్చింది. ఆమె కోలుకున్న తర్వాత మూడు రోజులు 12 గంటల పాటు 100 ప్రశ్నలు వేసింది.

కాగా.. 1938లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రూ ‘నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా భారతీయు వాణి వినిపించేందుకు ఈ పత్రికని తీసుకొచ్చారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) సంస్థ ఆధ్వర్యంలో ఈ పత్రిక నిర్వహణ కొనసాగింది. అయితే.. ఆర్థిక సమస్యల కారణంగా 2008లో ఈ న్యూస్‌పేపర్ ఆపరేషన్స్ ఆగిపోయాయి. తిరిగి 2016లో యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ వార్తా సంస్థ సేవలు పునఃప్రారంభమయ్యాయి. మరోవైపు.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై తాము సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకే, కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగేవారి నోరు మూయించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తోందని మండిపడింది. ఈ బెదిరింపులకు తాము తలవంచబోమని కాంగ్రెస్ ప్రతినిధి సయ్యద్ నసీర్ హుస్సేన్ స్పష్టం చేశారు.