Site icon NTV Telugu

ED At Dawood Sisters House : దావూద్ సోదరి ఇంటిపై ఈడీ దాడులు

దేశంలో వివిధ కేసులకు సంబంధించి ఈడీ దూకుడు పెంచింది. తాజాగా ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం సోదరి, సోదరుడి ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించడం కలకలం రేపింది. దీంతో పాటు గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది ఇంటిపైనా దాడులు చేయడంతో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తి నెలకొంది. ఎన్ఐఏ కేసు దర్యాప్తులో భాగంగానే ఈడీ దాడులు చోటుచేసుకున్నాయి.

ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్, సోదరుడు ఇక్బాల్ కస్కర్, గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. మనీ లాండరింగ్, హవాలా, అక్రమ ఆస్తి లావాదేవీల గుట్టుని రట్టుచేసేందుకు ఈ దాడులు జరిగాయి. ఈడీతో పాటు ఎన్ఐఏ ఇటీవల దావూద్ ఇబ్రహీంపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం నమోదు చేసింది.

ఈ కేసులో భాగంగానే ఈడీ దాడులు నిర్వహించిందని చెబుతున్నారు. ఈ దాడుల్లో పలువురు వ్యాపార వేత్తల లావాదేవీల కూపీ లాగినట్టు తెలుస్తోంది. ముంబై, దుబాయ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొందరు వ్యాపారుల అక్రమ ఆస్తి లావాదేవీలు, దౌర్జన్యంగా డబ్బు వసూలు చేసిన వ్యవహారాలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఈ వ్యవహారాల వెనుక ఎవరున్నారనేది విచారిస్తున్నారు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు.

https://ntvtelugu.com/police-issued-notice-to-bangalore-dodda-ganapathi-temple-due-to-noise-pollution/
Exit mobile version