Site icon NTV Telugu

Rare-earths: “అరుదైన భూమి” కోసం భారత్ ఆరాటం.. చైనాకు చెక్ పెట్టే ప్లాన్..

Rare Earths

Rare Earths

Rare-earths: రేర్ ఎర్త్ మెటీరియల్స్‌పై చైనాపై ఆధారపడకుండా భారత్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ముక్యంగా ఎలక్ట్రిక్ వాహనాల్లోని మోటర్స్‌లో ఉపయోగించే రేర్ ఎర్త్ అయస్కాంతాలపై చైనా దేశంపై అతిగా ఆధారపడొద్దని భారత్ నిర్ణయించుకుంది. ప్రపంచంలో ప్రస్తుతం రేర్ ఎర్త్ మూలకాలు, అయస్కాంతాల ఉత్పత్తిలో చైనా నియంతృత్వం కొనసాగుతోంది. దీంతోనే, భారత్ 25 బిలియన్ రూపాయలు ($290 మిలియన్లు) విలువైన ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది. ఇది ఈ అయస్కాంతాలను తయారు చేసేలా పెద్ద ప్రైవేట్ కంపెనీలను ఆకర్షిస్తుంది.

ఈ పాలసీకి సంబంధించి ఇప్పటికే బ్లూ ప్రింట్ తయారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిని కేబినెట్ ఆమోదం కోసం సమర్పించే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవకు, ప్రముఖ కంపెనీలైన వేదాంత గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో సహా ఈవీ విడిభాగాల తయారీ సంస్థ సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ ఆసక్తి చూపిస్తున్నాయి.

Read Also: Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్‌లో నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్లు వాళ్లే..

ఏడేళ్ల కాలంలో స్థానికంగా తవ్విన ముడి పదార్థాలను ఉపయోగించి సుమారు 4000 టన్నుల అరుదైన అయస్కాంతాల ఉత్పత్తిలో మూడు లేదా నాలుగు పెద్ద కంపెనీలకు మద్దతు ఇవ్వాలని భారత్ యోచిస్తోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ని దెబ్బకొట్టేందుకు చైనా ఎప్పుడైనా ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ సరఫరాను నిలిపేసే అవకాశం ఉండటంతో భారత్ ముందుజాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటీరియల్ ప్రాసెసింగ్‌లో దాదాపు 90 శాతం నియంత్రణను చైనా కలిగి ఉంది.

ప్రతిపాదిత బ్లూ ప్రింట్ ప్రకారం, కంపెనీలు 500 టన్నుల నుంచి 1500 టన్నుల మధ్య వార్షిక ఉత్పత్తి సామర్థ్యాల కోసం వేలం వేస్తాయిన బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనరంగం వేగం పుంజుకుంది. ప్రజలు విద్యుత్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారత ఆటోమొబైల్ రంగానికి రేర్ ఎర్త్ అయస్కాంతాలు చాలా కీలకం.

భారతదేశం చాలా కాలంగా దేశీయంగా లేదా విదేశీ ప్రాజెక్టుల ద్వారా అరుదైన ఖనిజ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ ప్రయత్నాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. సబ్సిడీలు లేకుండా భారత్‌లో ఈ తరహా అయస్కాంతాలను ఉత్పత్తి చేయడం దాదాపుగా అసాధ్యం. అందుకనే ఆసక్తి చూపించే కంపెనీలకు ప్రోత్సహకాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.

Exit mobile version