రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. దీంతో జూలై 24లోపే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనున్నాయి. జూలై 25న భారత దేశానికి కొత్త రాష్ట్రపతి కొలువుదీరనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జూన్ 15న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల చివరి గడవు జూన్ 29గా సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. జూలై 18న ఎన్నికలకు ఓటింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. జూలై 21న ఓట్ల లెక్కింపు ఉండనున్నట్లుగా రాజీవ్ కుమార్ వెల్లడించారు.
పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నుకోబడిన సభ్యులు, దేశ రాజధాని ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో సహా అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభ,లోక్‌సభ లేదా రాష్ట్రాల శాసనసభల నామినేట్ చేయబడిన సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానందు వల్ల వారు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులు. శాసన మండలి సభ్యులు కూడా రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానందును ఓటింగ్ లో పాల్గొనేందుకు అనర్హులు
2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మొత్తం 4,809 మంది ఓటర్లు ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ తన సభ్యలుకు విప్ జారీ చేయదని సీఈసీ పేర్కొన్నారు. ప్రస్తుతం మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓటు విలువ 10,98,903 కాగా ప్రస్తుతం బీజేపీకి 4,65,797 ఓట్ల విలువ ఉండగా..మిత్ర పక్షాలకు 71,329 ఓట్లు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ రావడంతో అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెడుతుందో అనే ఉత్కంఠ అప్పడే మొదలైంది. దీంతో పాటు బీజేపీకి వ్యతిరేఖంగా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థి ఉండవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల
షెడ్యూల్
————————
• ఎన్నికల నోటిఫికేషన్ తేదీ : జూన్ 15.
• నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ : జూన్ 29.
• నామినేషన్ల పరిశీలన : జూన్ 30.
• నామినేషన్ల ఉపసంహరణ: జులై 2.
• ఎన్నికల తేదీ (ఓటింగ్) : జులై 18 .
• ఎన్నికల ఫలితం (కౌంటింగ్): జులై 21.
