Earthquake: హిమాలయాల్లో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆదివారం రోజున నేపాల్‌లో రెండు సార్లు భూకంపం వచ్చింది. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్‌సీఎస్) వెల్లడించింది. ఆదివారం రాత్రి రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతం అయింది.
ఆదివారం ఉదయం నేపాల్‌లో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాజధాని ఖాట్మాండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్ లో భూకంప కేంద్రం ఉంది.
హిమాలయ ప్రాంతాలు భూకంప ప్రభావితం ప్రాంతాల జాబితాలో ఉంది. ఈ ప్రాంతంలో భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, యూరేషియా టెక్టానిక్ ప్లేటును ఉత్తరం దిశగా నెడుతోంది. ఈ ప్రక్రియలో గణనీయమైన శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తోంది.
సోమవారం ఉదయం భారత సరిహద్దు దేశం మయన్మార్ లో కూడా భూకంపం సంభవించింది. 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ఎన్సీఎస్ తెలిపింది. భూకంపం 90 కిలోమీటర్ల లోతులో సంభవించింది.