Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పోర్ట్‌బ్లెయిర్‌కు సమీపంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది. పోర్ట్‌బ్లెయిర్‌కు ఈశాన్యంగా 126 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. సముద్ర ఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.53 నిమిషాలకు భూకంపం చోటుచేసుకున్నట్టు పేర్కొంది. భూకంపం కారణంగా అండమాన్, నికోబార్ దీవుల పరిసరాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అండమాన్‌తో పాటు 5.9 తీవ్రతతో ఆఫ్రికాకు సమీపంలో ఉన్న నైరుతి భారతీయ శిఖరం వద్దా భూమి ప్రకంపించినట్లు సమాచారం. భూకంపానికి సంబంధించి ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, దీనికి సమాంతరంగా పాకిస్థాన్‌లోనూ ఈ ఉదయం భూకంపం వచ్చినట్టు ఎన్‌సీఎస్ పేర్కొంది. ఇది రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదయినట్టు వివరించారు.
Read also: Maruti Baleno Price 2023: రూ 1.5 లక్షలు చెల్లించి.. మారుతి బాలెనోను ఇంటికి తీసుకెళ్లండి!
శుక్రవారం ఉదయం ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లోనూ రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సియాంజ్ జిల్లాలోని పంజిన్‌కు ఉత్తరంగా 220 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. శుక్రవారం ఉదయం 8.50 గంటలకు భూకంపం చోటుచేసుకుంది. అయితే, ఎటువంటి ప్రాణనష్టం మాత్రం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇండియా, బర్మా ప్లేట్ సమీపంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు క్రియాశీలక భూకంపాల జోన్ పరిధిలో ఉన్నాయి. ఈ ప్లేట్‌లు తరుచూ కదులుతుండటంతో భూకంపాలు సాధారణంగా చోటుచేసుకుంటాయి. ఇదే ఒక్కోసారి సునామీలకు కారణమవుతుంటాయి. 2004లో వచ్చిన భూకంపం.. అండమాన్ నికోబార్ దీవులను అతలాకుతలం చేసింది. భూకంపం కారణంగా సునామీ సంభవించి 10 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందుకే భూకంప నిరోధక మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా ఈ ప్రాంతంలో భూకంపాల ప్రమాదాన్ని తగ్గించే దిశలో ప్రభుత్వం చురుకుగా పని చేస్తోంది. విపత్తు సంసిద్ధత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి చేపడుతోంది.