E85 Fuel: దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, పెట్రోల్ ధరల భారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే E85 ఇంధనాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సుజుకి తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ‘వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్’ ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే E85 ఇంధనం గణనీయంగా చౌకగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ఇంధనాన్ని ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల్లో మాత్రమే ఉపయోగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో ప్రస్తుతం సుమారు 30 కోట్ల ద్విచక్ర వాహనాలు, 37 లక్షల ప్రయాణికుల కార్లు ఉన్నాయని పేర్కొన్న మంత్రి, వీటిలో ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ వినియోగం పెరిగితే ఇథనాల్ డిమాండ్ భారీగా పెరుగుతుందని తెలిపారు. కొత్తగా విక్రయించే వాహనాల్లో 50 శాతం ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో వస్తే దేశంలో ఇథనాల్ వినియోగం 4 బిలియన్ లీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. E85 ఇంధనం అంటే 85 శాతం వరకు ఇథనాల్, 15 శాతం పెట్రోల్ కలయికతో తయారయ్యే ప్రత్యేక ఇంధనం. ఇది సాధారణ పెట్రోల్ వాహనాల్లో కాకుండా, ప్రత్యేకంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌ల కోసం రూపొందించిన వాహనాల్లో మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఇంధనం ద్వారా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు రైతులకు కూడా లాభం చేకూరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
E85 ఇంధనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. తొలి దశలో ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై-పూణే-నాగ్‌పూర్ కారిడార్లలో 50 నుంచి 100 E85 ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వీటి సంఖ్యను 500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 5,000 E85 ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. హీరో మోటోకార్ప్ ఇప్పటికే స్ప్లెండర్ ప్లస్, హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లను విడుదల చేసింది. ఈ బైకులు E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమాలతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
మరోవైపు మారుతి సుజుకి కూడా దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను పరిచయం చేసింది. కంపెనీ 1.2 లీటర్ K12N పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా రూపొందించిన ఈ వాహనం E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమాలపై పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ వాహనం ఫ్లీట్ ఆపరేటర్లు, క్యాబ్ సేవల సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉండగా, భవిష్యత్తులో వ్యక్తిగత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇంధన వ్యయాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఇంధన దిగుమతుల తగ్గింపు లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు దేశ రవాణా రంగంలో కీలక మార్పులకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
