NTV Telugu Site icon

Drugs Smuggling: బెంగళూర్ లో భారీ స్థాయిలో పట్టుబడ్డ డ్రగ్స్

Drugs

Drugs

దేశంలో రోజుకు ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవల కేరళ తీరంలో దాదాపుగా రూ. 1500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూర్ అంతర్జాతీయ కార్గోలో పెద్ద ఎత్తున భారీగా ఎఫిడ్రీన్ పట్టివేశారు. 90 లక్షల విలువైన 5 కేజీల డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్తున్న పార్సిల్ లో ఈ డ్రగ్స్ ను దాచిపెట్టి అక్రమ రవాణా చేయాలని  చూశారు.

కస్టమ్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా రెడీమేడ్ దస్తుల్లో డ్రగ్స్ ను దాచి తరలించే యత్నం చేశారు. పక్కా సమాచారంతో అంతర్జాతీయ కొరియర్ టర్మినల్ వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆస్ట్రేలియా కు ఎగుమతి చేయడానికి సిద్దంగా ఉన్న పార్శిల్ ను పరిశీలించిన కస్టమ్ అధికారులకు రెడీమేడ్ దుస్తుల్లో దాచిన డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేసి పార్సిల్ రూపంలో డ్రగ్స్ తరలింపుకు ప్లాన్ చేశారు కేటుగాళ్లు.

అయితే బెంగళూర్ లో పట్టుబడిన డ్రగ్స్ కు ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడకు లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైలో గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఆధార్ కార్డును తన ఫోటో తో మార్ఫింగ్ చేసి, డ్రగ్స్ ఎగుమతి చేయడానికి యత్నం చేశారు. విజయవాడలోని కొరియర్ ఏజెన్సీని సంప్రదించిన వ్యక్తిని అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. కాగా వీరి వెనుక ఎవరు ఉన్నారనే వివరాలను రాబడుతున్నారు అధికారులు.

ఇటీవల ఇదే విధంగా ఎయిర్ పోర్టులు వేదికగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న క్రమంలో నిందితులు పట్టుబడ్డారు. బెంగళూర్, చెన్నై, ట్రిచి ఎయిర్ పోర్టుల్లో ఒకే సారి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.