NTV Telugu Site icon

DRDO: మానవరహిత యుద్ధ విమానాన్ని తొలిసారి పరీక్షించిన డీఆర్డీవో

Unmanned Aircraft

Unmanned Aircraft

దేశ రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మానవరహిత విమానాన్ని డీఆర్డీవో తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ్‌లో గల ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో ఈ మానవరహిత విమానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్డీవో వెల్లడించింది. అమితవేగంతో దూసుకుపోయిన ఈ విమానం డీఆర్డీవో పరిశోధకుల్లో ఆనందోత్సాహాలు నింపింది. మానవ రహిత యుద్ధ విమానం అభివృద్ధిలో ఇది ఘనవిజయం అని డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. స్వదేశీ పరిజ్ఞానమైన ఆటోనామస్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ టెక్నాలజీ ఆధారంగా తొలి విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది.

మొట్టమొదటిసారిగా ఇవాళ నిర్వహించిన పరీక్షలో ఇది సాఫీగా టేకాఫ్ తీసుకుని గగనవిహారం చేయడమే కాకుండా, ఎలాంటి లోపాలు లేకుండా తిరిగి ల్యాండైంది. దీనిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. అపూర్వమైన ఘనత సాధించారంటూ డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. క్లిష్టమైన సైనిక వ్యవస్థల రూపకల్పన దిశగా ‘ఆత్మనిర్భర్ భారత్’ కు మార్గదర్శనం చేశారని కొనియాడారు. భవిష్యత్తు మానవ రహిత యుద్ధ విమానాలను రూపొందించే దిశగా కీలక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఈ విమానం కీలక మైలురాయిగా మారనుందని డీఆర్‌డీఓ వెల్లడించింది. అంతేగాక, వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలో స్వావలంబన సాధించేందుకు ఇదో కీలక ముందడుగుగా అభివర్ణించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ డీఆర్‌డీఓను అభినందించారు.