Bengaluru DRDO Scientist Death: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)కు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA)లో పనిచేస్తున్న 47 ఏళ్ల సీనియర్ శాస్త్రవేత్త మృతి కలకలం రేపింది. అక్టోబర్ 21న బెంగళూరులోని సీగేహళ్లిలో నివాస భవనం నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పని ఒత్తిడి కారణంగా తీవ్ర మానసిక ఇబ్బందులకు గురయ్యారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడిని శరద్ కటియార్గా గుర్తించారు. ఆయన ADAలోని ప్రోగ్రామింగ్ విభాగంలో సైంటిస్ట్ ‘ఎఫ్’గా పనిచేస్తున్నారు. సీగేహళ్లిలోని ఓ నివాస భవనంలో నాలుగో అంతస్తులో కుటుంబంతో కలిసి నివసించేవారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో శరద్ కటియార్ కుటుంబ సభ్యులు కీలక విషయాలను వెల్లడించారు. సుమారు నెల రోజులుగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిని, పని సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యలతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య నిపుణులను సంప్రదించారని, అక్కడ డిప్రెసివ్ ఎపిసోడ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
చికిత్స తీసుకుంటున్నప్పటికీ కార్యాలయంలో పని ఒత్తిడి కొనసాగిందని వారు ఆరోపించారు. ఘటన జరిగిన అక్టోబర్ 21న కూడా బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS)కు వెళ్లి మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించారు. అనంతరం వైద్యులు మందులు సూచించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, అక్టోబర్ 21న రాత్రి 7.30 నుంచి 8 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. శరద్ కటియార్ తన అపార్ట్మెంట్లోని నాలుగో, ఐదో అంతస్తుల మధ్య ఉన్న మెట్ల ప్రాంతానికి వెళ్లి కిటికీ నుంచి కిందికి దూకినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి కేఎస్ హళ్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు (BNSS), 2023లోని సెక్షన్ 194 కింద అసహజ మరణ నివేదిక (UDR) నమోదు చేశారు. అక్టోబర్ 22న ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఆసుపత్రి మార్చురీలో విచారణ ప్రక్రియను నిర్వహించారు. శరద్ కటియార్ భార్యతో పాటు ఆయన తల్లిదండ్రులు సురేశ్ చంద్ర కటియార్, సుధా కటియార్ వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. శాస్త్రవేత్త మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
శరద్ కటియార్ మృతిపై ADA అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ డైరెక్టర్ కృష్ణ రాజేంద్ర స్పందించారు. ఆయన లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) Mk2 ప్రోగ్రామ్ కార్యాలయంలో పనిచేస్తున్నారని తెలిపారు. శరద్ కటియార్ ఎదుర్కొంటున్నట్లు చెబుతున్న సమస్యల గురించి సంస్థకు ముందుగా సమాచారం లేదని, ఆయన సహచరుల్లో కొందరిని అడిగినా తమకు అలాంటి విషయం తెలియదని చెప్పారని వివరించారు. శరద్ కటియార్ తీసుకున్న తీవ్ర నిర్ణయానికి పని ఒత్తిడి ఒక్కటే కారణమని తాను భావించడం లేదని కృష్ణ రాజేంద్ర వ్యాఖ్యానించారు. ఆరోగ్యానికి సంబంధించిన ఇతర సమస్యలు కూడా ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆయనపై ఎలాంటి ఒత్తిడి లేదని వంద శాతం కచ్చితంగా చెప్పడం లేదని స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల గడువులను చేరుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఉద్యోగులపై కొంత ఒత్తిడి సహజమని, అయితే అందుకోసం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేయాల్సిన పరిస్థితి సంస్థలో లేదని తెలిపారు. ఉద్యోగులు సాధారణంగా ఉదయం 8.30 గంటలకు కార్యాలయానికి వచ్చి సాయంత్రం 6 గంటలకు వెళ్తారని, శరద్ కూడా క్రమం తప్పకుండా కార్యాలయానికి వస్తుండేవారని చెప్పారు. అలాగే, వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ కోసం ఆయన ఏమైనా దరఖాస్తు చేశారా అని పరిశీలించినట్లు తెలిపారు. ఔట్‌పేషెంట్ వైద్య ఖర్చులను కూడా సంస్థ తిరిగి చెల్లిస్తుందని, అయితే శరద్ నుంచి అలాంటి క్లెయిమ్ ఏదీ అందలేదని వివరించారు. ఓ శాస్త్రవేత్త ఇలా ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్న ఆయన, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసేందుకు ADA డైరెక్టర్, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కార్యాలయాల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు.
శరద్ కటియార్ మృతి నేపథ్యంలో కార్యాలయాల్లో పని ఒత్తిడి, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, అవసరమైన సమయంలో సహాయం అందించే వ్యవస్థలపై మరోసారి చర్చ మొదలైంది. అయితే, కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు, ADA అధికారి వెల్లడించిన వివరాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి, ఆరోగ్య పరిస్థితులు, ఇతర వ్యక్తిగత అంశాలు ఈ ఘటనలో ఏ మేరకు ప్రభావం చూపాయనే విషయాలు విచారణ పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

