Site icon NTV Telugu

MLA Umang Singhar: 10 కోట్లు ఇవ్వకపోతే.. అత్యాచారం కేసు పెడతానంది

Umar Singhar Case

Umar Singhar Case

Domestic Violence Case On Congress MLA Umang Singhar: మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉమంగ్‌ సింఘార్‌పై అత్యాచారంతో పాటు గృహహింస కేసు నమోదైంది. తాను ఉమంగ్ భార్య అని చెప్పుకుంటున్న ఓ మహిళ (38) ఫిర్యాదు మేరకు.. ఆదివారం సాయంత్రం ఆయనపై ధర్ సిటీలోని నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఉమంగ్ తనతో అసహజ శృంగారానికి పాల్పడుతున్నారని.. తాను వద్దని ఎంత మొరపెట్టుకున్నా విడిచిపెట్టకుండా తరచూ లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాలన్ని బయటకు చెప్తే, చంపేస్తానని ఉమంగ్ బెదిరించారని.. అందుకే ఇన్నాళ్లూ వేధింపుల్ని సహిస్తూ వచ్చానని తెలిపింది.

అయితే.. ఆ మహిళ చేసిన ఆరోపణల్ని ఉమర్ సింఘార్ తోసిపుచ్చారు. ఇది ఒక కుట్ర అని, డర్టీ పాలిటిక్స్‌లో భాగమని చెప్పారు. ఆ మహిళ తనని మానసిక వేధింపులకు గురి చేస్తోందని.. రూ. 10 కోట్లు ఇవ్వకపోతే, తనపై అత్యాచార కేసు పెడతానని బ్లాక్‌మెయిల్ చేస్తూ వస్తోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై తాను నవంబర్ 2వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదని వాపోయారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ కేసుపై మరో కాంగ్రెస్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ.. తనకు ఈ కేసు గురించి పూర్తిగా అవగాహన లేదని, కానీ పైపెచ్చు ఇది రాజకీయ కుట్రగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మాత్రం.. ఉమంగ్‌కి గతంలోనూ ఇతర భార్య ఉన్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

కాగా.. ఆదివాసీ వర్గంలో శక్తిమంతమైన రాజకీయ నేతగా పేరుగాంచిన ఉమంగ్, ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారులో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. తన సహజీవన భాగస్వామి సోనియా భరద్వాజ్‌ ఆత్మహత్యలో.. ఉమంగ్ ప్రమేయం ఉందని ఆయనపై ఓ కేసు ఉంది. దీంతోపాటు ఇతర నేరారోపణలు కూడా ఉమంగ్‌పై ఉన్నాయి.

Exit mobile version