కర్ణాటకలో అధికార మార్పిడి రాజకీయాలు సద్దుమణగలేదు. గత కొద్ది రోజులు పవర్ షేరింగ్‌పై వివాదం నడుస్తోంది. హస్తిన వేదికగా సాగిన రాజకీయాలు.. అనంతరం బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలుగా మారిపోయింది. కొన్ని రోజులుగా స్తబ్ధతగా ఉన్న రాజకీయాలు మళ్లీ డీకే.శివకుమార్ విందు రాజకీయాలతో హీటెక్కిస్తున్నారు.
గురువారం రాత్రి ఎమ్మెల్యేలకు డీకే.శివకుమార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు 30 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇందులో మంత్రులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్‌హౌస్‌లో విందు జరిగినట్లుగా వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, శివరామ్ హెబ్బర్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇదే రకమైన విందులో పాల్గొన్నారు. బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తైంది. దీంతో పవర్ షేరింగ్ వివాదం తెరపైకి వచ్చింది. డీకే.శివకుమార్ హస్తిన వేదికగా మంతనాలు జరిపారు. అనంతరం బెంగళూరుకు షిప్ట్ అయింది. సిద్ధరామయ్య ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్‌కు డీకే.శివకుమార్ హాజరు కాగా.. అనంతరం డిప్యూటీ సీఎం ఇచ్చిన విందుకు సిద్ధరామయ్య హాజరయ్యారు. అధిష్టానం అయితే ఇంకా ఏం తేల్చలేదు.
