Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!

Diwali

Diwali

Diwali lights safety tips: దీపావళి వచ్చేస్తోంది. చిన్నా పెద్దా అంతా ఈ పండగను ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దీపావళి రోజు ఇంటిని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించుకుంటారు. అయితే, ఈ అలంకరణలో ఏదైనా చిన్న నిర్లక్ష్యమైనా పెద్ద ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. నాణ్యత లేని లైట్లు, దెబ్బతిన్న వైర్లతో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది.

అందుకు దీపావళి లైట్లు కొనేటప్పుడు, ఇంట్లో అమర్చేటప్పుడు 5 ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

1) లైట్ల నాణ్యత, భద్రత ముఖ్యం..

దీపావళి కోసం లైట్లు కొనే ముందు వాటి నాణ్యత చాలా ముఖ్యం. తక్కువ ధరకే లైట్లు లభిస్తున్నాయని కొనుగోలు చేస్తే అవి ప్రమాదాలకు కారణం కావచ్చు. ధర ఒక్కటే కాకుండా వాటి నాణ్యత, భద్రతా ప్రమాణాలను కూడా పరిశీలించాలి. నాణ్యత లేని లైట్లు త్వరగా పాడవడమే కాకుండా విద్యుత్ ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ప్యాకేజింగ్‌పై భద్రతా ధ్రువీకరణ గుర్తులు, తయారీదారి వివరాలు, వినియోగినికి సంబంధించిన సూచనలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

2) వైర్లు, ఫ్లగ్‌లు, కనెక్షన్లు చెక్ చేయాలి..

లైట్లు కొనుగోలు చేసే ముందు వాటి వైర్లు, ఫ్లగ్‌లు, కనెక్షన్లను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. వైర్లు చిరిగిపోయినా, లోపల తీగలు బయటకు కనిపించినా, ఫ్లగ్‌లు దెబ్బతిన్నా అలాంటి లైట్లను తీసుకోవద్దు. ఇంట్లో పాత లైట్లు ఉంటే, వాటిని మళ్లీ వాడాలని అనుకుంటే వైరింగ్‌‌ను సరిగా పరిశీలించాలి. లేకపోతే షార్ట్ సర్క్యూట్, కరెంట్ షాక్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

3) ఎక్స్‌టెన్షన్ బోర్డులపై అధిక లోడ్ లేకుండా చూడండి..

దీపావళి రోజు అనేక విద్యుత్ దీపాలను ఒకే ఎక్స్‌టెన్షన్ బోర్డులకు కనెక్ట్ చేయడం చూస్తుంటాం. ఒక వేళ బోర్డు సామర్థ్యానికి మించి కనెక్షన్లు ఉంటే షార్ట్ సర్క్యూట్, అగ్నిప్రమాదాలకు దారితీయొచ్చు. ఒకే బోర్డులో అవసరానికి మించి కనెక్షన్లు ఇవ్వకూడదు. ఎక్స్‌టెన్షన్ బోర్డుల్ని నాణ్యమైన వాటిని తీసుకోవాలి. కనెక్షన్ లోడ్‌కు అనుగుణంగా ఉందో లేదో చూసుకోవాలి.

4) రాత్రంతా లైట్లు ఆన్‌లో ఉంచొద్దు..

దీపావళి రోజు ఇంటి బయట, బాల్కానీ, పైకప్పులపై ఏర్పాటు చేసిన లైట్లను రాత్రంతా ఆన్‌లో ఉండచం చాలా మంది చేస్తుంటారు. అయితే, నాణ్యత తక్కువగా ఉండే లైట్లు లేదా వైరింగ్ ఉంటే అవి నిరంతరం వేడిక్కి ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. నిద్రపోయే ముందు ఆఫ్ చేస్తే మంచింది. దీంతో లైట్ల మన్నిక బాగుండటంతో పాటు విద్యుత్ ఆదా అవుతుంది, ప్రమాదాల ముప్పు కూడా తగ్గుతుంది.

5) తడి చేతులతో లైట్లు, ఫ్లగ్‌లు తాకొద్దు..

ఇంటికి అలంకరించిన లైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తడి చేతులతో ముట్టుకోవద్దు. లైట్లు ఆర్పేటప్పుడు, కనెక్షన్లు చెక్ చేసేటప్పుడు తప్పనిసరిగా చేతులు తడిగా లేకుండా చూసుకోవాలి. వైర్లు తడిగా ఉన్నా, దెబ్బతిన్నా, వాటిని తాకకుండా ముందుగా విద్యుత్ సరఫరా నిలిపేయాలి. అవసరమైతే ఎలక్ట్రీషియన్ సహాయం తీసుకోవాలి.