NTV Telugu Site icon

Hathras: హత్రాస్‌ తొక్కిసలాటతో.. అలర్టైన మరో బాబా.. భక్తులకు ఏం చెప్పారంటే..!

Hatras

Hatras

Hathras: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు మృతి చెందిన భక్తుల సంఖ్య 121కి చేరింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అప్రమత్తమైన మధ్యప్రదేశ్‌కు చెందిన మరో బాబా తన అనుచరులను ఉద్దేశిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దర్శనానికి భక్తులు, అనుచరులు అధిక సంఖ్యలో వస్తుంటారు. జూలై నాలుగవ తేదీన జరిగే అతని పుట్టిన రోజుల వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే, హత్రాస్‌ ఘటన నేపథ్యంలో మరోమారు అలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతో పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియోను షేర్‌ చేశారు.

Read Also: Bears on the beach: సముద్రతీరంలో ఎలుగుబంట్ల జలకాలాట.. పరుగులు పెట్టిన టూరిస్టులు

కాగా, ఆ వీడియోలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి ‘జూలై 4వ తేదీన పుట్టిన రోజు.. ఆ రోజు నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గుతుంది అని చెప్పుకొచ్చారు. అయితే ఆ రోజు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. ఈ వీడియో ద్వారా భక్తులందరికి ఒక అభ్యర్థన చేస్తున్నాను.. జూలై నాలుగున జరిగే వేడుకలకు దూర ప్రాంతాల నుంచి రావాలని అనుకుంటున్నా.. వారు తమ ఇళ్లలోనే పూజలు చేసుకోవాలి అని వెల్లడించారు. ఇప్పటికే ఇక్కడ భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. భద్రత దృష్ట్యా ఎక్కడి వారు అక్కడే వేడుకలు చేసుకోవాలి అని ధీరేంద్ర కృష్ణ శాస్త్రి విజ్ఞప్తి చేశారు.