BJP: బీజేపీ పెద్ద లక్ష్యాల కోసం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చిన్న తాగ్యమా.?

  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం..
  • జంతర్ మంతర్ ఉద్యమం, పార్లమెంట్ సమావేశాలతో ప్రభుత్వంపై ఒత్తిడి..
  • డీలిమిటేషన్ బిల్లుపై దృష్టి పెట్టేందుకే ప్రభుత్వం వ్యూహాత్మక వెనకడుగు..
  • యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే ప్రధాన రాజీనామా త్యాగం..
Pm Modi

Pm Modi

BJP: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. జంతన్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న యువత, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన నిరసనను విరమించుకుంది. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం బీజేపీ పెద్ద లక్ష్యాల ముందు కేవలం చిన్న త్యాగంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. వర్షాకాల సమావేశాల్లో అనవసరం రాద్ధాంతం ఎందుకని బీజేపీ భావించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

డీలిమిటేషన్, FCRA బిల్లుల కోసమేనా.?

కేంద్రం ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పలు బిల్లులను ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో పెట్టాలని భావిస్తోంది. ఇలాంటి సమయంలో యువత ఆందోళనలు, వివక్షాల నిరసనలు అవసరమా అని బీజేపీ భావించి ఉంటుంది. ముఖ్యంగా, డీలిమిటేషన్ బిల్లును ఈ సమావేశాల్లోనే తీసుకురాబోతోంది. దీంతో పాటు విదేశీ విరాళాల (సవరణ) బిల్లు( FCRA) బిల్లును కూడా తీసుకురాబోంది. ఏప్రిల్ నెలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ఎన్డీయే సర్కార్ తీసుకువచ్చింది. అయితే, ఆ సమయంలో సంఖ్యా బలం లేకపోవడంతో బిల్లు వీగిపోయింది.

ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీఎంసీ రెబల్ ఎంపీలు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు ఏక్‌నాథ్ షిండే గ్రూపులో చేరడం, ఎన్సీపీ శరద్ పవార్ గ్రూపు కూడా ఎన్డీయేలో చేరేందుకు సిద్ధం కావడం బీజేపీకి కలిసి వస్తోంది. ఇదే కాకుండా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు కూడా దీనికి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌తో విభేదాల కారణంగా డీఎంకే కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు సముఖంగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభలో బిల్లుకు 2/3 వంతు మెజారిటీ వస్తోంది. బిల్లు ఈజీగా పాస్ అవుతుంది.

కీలకంగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు:

ఇదిలా ఉంటే, మరొ 5-6 నెలల్లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిరసనకారులపై బలప్రదర్శన చేస్తే, ఏదైనా మరణాలు సంభవిస్తే బీజేపీ యూపీ ఫలితాలపై ప్రభావం పడుతుందని భావించింది. ప్రతిపక్షాలకు ఇది ఒక అస్త్రంగా మారొద్దని భావించింది. హింసలో ఏదైనా పెద్ద సంఘటన జరిగితే దీనిని రాజకీయం చేయడానికి ప్రతిపక్షాలు ఉన్నాయని భావించే బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరింది.

దేశంలో 80 వరకు ఎంపీ స్థానాలు ఉన్న యూపీలో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారం ఏర్పాటు చేస్తుందనేది వాస్తవం. 2029 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలవాలంటే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. మళ్లీ యోగి అధికారంలోకి వస్తే లోక్‌సభ ఎన్నికల నాటికి మెరుగైన ప్రదర్శన చేయవచ్చని బీజేపీ భావిస్తోంది.

పంజాబ్‌లో ఆప్‌‌ను, కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే వ్యూహం..

యూపీలో పాటు మరికొన్ని నెలల్లో పంజాబ్ ఎన్నికలు జరగబోతున్నాయి. పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉంది. ఇటీవల పంజాబ్‌లో కూడా పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పిలుపునిచ్చిన కాక్రోచ్ పార్టీ నేతల్లో చాలా మంది ఆప్‌తో సంబంధాలు ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బీజేపీ ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది.

ఇప్పుడు, పంజాబ్‌లో ఆప్ విద్యాశాఖ మంత్రి రాజీనామాను బీజేపీ మరింత బలంగా కోరుతుంది. కేంద్ర మంత్రి రాజీనామా చేసినప్పుడు, రాష్ట్రంలోని మంత్రి కూడా రాజీనామా చేయాలనే నినాదాన్ని తీసుకువస్తుంది. ఇది ఒకవైపు పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ బలపడేందుకు ఒక అవకాశంగా మారడంతో పాటు ఆప్-కాక్రోచ్ జనతా పార్టీ సంబంధాలను బహిర్గతం చేయడానికి ఉపయోగపడుతుంది.

ఇక కర్ణాటకలో కూడా పేపర్ లీక్ వివాదం ఉంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రధాన్ రాజీనామాను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు ఎక్కు పెడుతుంది. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్‌లో గ్రూపు తగదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ చేస్తే , ఎన్నికల నాటికి ఒక నారెటివ్ సెట్ చేయొచ్చు.

రాజకీయంగా లాభమే:

ఇన్నాళ్లు ప్రతిపక్షాలు కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యంగా ఉండటం లేదు నియంతగా పాలిస్తుందని బీజేపీని విమర్శించేవి. కానీ, కేంద్రమంత్రి రాజీనామా తర్వాత తన క్యారెక్టర్ మార్చుకున్నట్లుగా భావిస్తుంది. ఉద్యమాలు, యువత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ప్రజల్లో ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇదే సమయంలో ఎంతో కొంత బీజేపీపై ప్రజల్లో సానుభూతి కూడా పెరుగొచ్చు. ఇది అల్టిమేట్‌గా వచ్చే ఎన్నికల్లో లాభంగా మారొచ్చని లెక్కలేసుకుంటోంది.