విమాన ప్రయాణాల భద్రత విషయంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని విమానయాన సంస్థల్లో పనిచేస్తున్న పైలట్లకు ఒక్కసారి డ్రగ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించినట్లు ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వచ్చే ఏడాది జూలై నాటికి ఈ పరీక్షలను పూర్తి చేయాలని ఎయిర్‌లైన్స్‌కు సూచించినట్లు తెలిపారు. ఇటీవల విమాన సిబ్బంది నిషేధిత మాదక ద్రవ్యాల ప్రభావంలో ఉన్నట్లు గుర్తించిన ఘటనలు వెలుగులోకి రావడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు విమానయాన సంస్థల్లో పైలట్ల డ్రగ్ టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం.
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో పైలట్ల డ్రగ్ టెస్టుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్‌బస్ A320 విమానంలో మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు ఒకేసారి పనిచేయకుండా పోయాయి. విమానంలో భద్రత కోసం అనేక స్థాయిల్లో ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఉండటంతో మూడు హైడ్రాలిక్ సిస్టమ్స్ ఒకేసారి విఫలం కావడం చాలా అరుదైన ఘటనగా భావిస్తున్నారు. ఈ వైఫల్యం కారణంగా ఆటోపైలట్ డిస్‌ఎంగేజ్ అయి విమానం సుమారు 300 అడుగుల మేర కిందికి పడిపోయింది.
పైలట్ డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్
ఆగస్టు 4న ఈ విమానం భారత్‌లో ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో విమానం కెప్టెన్ నిషేధిత మాదక ద్రవ్యాలకు పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు గుర్తించారు. అయితే పైలట్ మాదక ద్రవ్యాల వినియోగానికి, విమానం గాల్లో అకస్మాత్తుగా కిందికి పడిపోవడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందా అనే విషయం దర్యాప్తులో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అయితే ఈ డ్రగ్ వినియోగం వెలుగులోకి రావడం “తీవ్రమైన ఆందోళన కలిగించే అంశం” అని భారత విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) పేర్కొంది. ఇటీవల విడుదల చేసిన మధ్యంతర నివేదికలో ఈ విషయంపై డీజీసీఏ తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఎయిర్ ఇండియా కూడా కీలక నిర్ణయం
ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా కూడా తన పైలట్లందరికీ ఒక్కసారి డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పైలట్ల డ్రగ్ టెస్టింగ్ నిబంధనలను మరింత పటిష్టం చేసే అంశంపై డీజీసీఏ విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇదిలా ఉంటే మలేషియా ఎయిర్‌లైన్స్ కూడా ఆగస్టులో తమ కాక్‌పిట్ సిబ్బందిలో ఒకరిని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్ట్ చేసిన ఘటన తర్వాత తప్పనిసరి డ్రగ్ టెస్టింగ్‌ను ప్రవేశపెట్టింది.
నెలాఖరులో కొత్త నిబంధనలు
పైలట్లకు సంబంధించిన సవరించిన డ్రగ్ టెస్టింగ్ నిబంధనల ముసాయిదాను ఈ నెలాఖరులోగా ఖరారు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కొత్త నిబంధనల్లో ఏ మార్పులు చేయబోతున్నారనే విషయాన్ని మంత్రి వివరించలేదు. అయితే పైలట్లు వినియోగించే సైకోయాక్టివ్ పదార్థాలపై మరింత కఠినమైన పరీక్షలు, అలాగే దేశవ్యాప్తంగా అన్ని విమానయాన సంస్థలకు మరింత సమగ్రంగా వర్తించే విధానాన్ని తీసుకురావచ్చని తెలుస్తోంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే పైలట్ల ఆరోగ్యం, అప్రమత్తత, ప్రయాణికుల భద్రత విషయంలో విమానయాన సంస్థలపై మరింత బాధ్యత పెరగనుంది.

