మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య దాదాపు 30 నిమిషాల పాటు చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై వారు చర్చించినట్లు సమాచారం. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశం గురించి నడ్డాకు ఫడ్నవీస్ వివరించినట్లు తెలుస్తోంది.ఇటీవల ఫడ్నవీస్ బీజేపీ అగ్ర నాయకత్వంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
జేపీ నడ్డాతో చర్చల అనంతరం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్న ఫడ్నవీస్ నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లారు. రాజ్ భవన్‌లో గవర్నర్ కోషియారీతో భేటీ అయ్యారు. బలనిరూపణ పరీక్షకు పిలవాలని గవర్నర్‌ను ఫడ్నవీస్ కోరారు. మహా వికాస్ అఘాడీ సంకీర్ణ కూటమి మెజారిటీ కోల్పోయిందని.. వెంటనే బలనిరూపణ చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జూన్ 30న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశంతో పాటు.. అదే రోజు బల నిరూపణ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలు బలనిరూపణ పరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు ఈమెయిల్ ద్వారా కోరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఫడ్నవీస్‌కు జేపీ నడ్డా దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పరిణామాలపై మహారాష్ట్ర బీజేపీ వడివడిగా అడుగులేస్తోంది. మహారాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉన్న ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లి జాతీయ నేతలతో చర్చలు జరుపుతున్నారు. మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శివసేన తిరుగుబాటు వర్గం మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఏక్‌నాథ్ సిండే నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు శాసన సభ ఉప సభాపతి జారీ చేసిన నోటీసులను సుప్రీంకోర్టు సోమవారం అడ్డుకుంది. ఈ నోటీసులపై తదుపరి చర్యలను జూలై 11 వరకు నిలిపేసింది. శాసన సభలో బల పరీక్ష నిర్వహించకుండా ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ, అటువంటి తాత్కాలిక ఆదేశాలు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
మహారాష్ట్రలో 288 శాసన సభ స్థానాలు ఉన్నాయి. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అగాడీ కూటమిగా ఏర్పడి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వానికి 169 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండేది. అయితే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో తిరుగుబాటు రావడంతో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు. ప్రతిపక్షంలోని బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఆర్ఎస్పీ (1), జేఎస్ఎస్ (1), ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.