NTV Telugu Site icon

Kolkata Doctor case: వైద్యురాలి హత్యాచార ఘటనపై జేపీ నడ్డా కీలక వీడియో విడుదల

Nadda

Nadda

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జేపీ నడ్డా వీడియో విడుదల చేశారు.

వైద్యురాలి హత్యాచార ఘటన హృదయాన్ని కలిచి వేస్తోందన్నారు. యావత్ దేశాన్ని కదిలించిందన్నారు. ఈ అమానవీయ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. సంఘటనను దాచిపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నిస్తోందని నడ్డా ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని తెలిపారు. అన్యాయం తారాస్థాయికి చేరిందని.. అందుకే మహిళలపై నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.

హత్యాచార ఘటన కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీన్ని జేపీ నడ్డా స్వాగతించారు. సీబీఐ విచారణ ద్వారా నిజం బయటపడుతుందని తెలిపారు. తనను అనేక మంది వైద్య సంఘాల ప్రతినిధులు కలిశారని చెప్పారు. వైద్యులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చినట్లుగా వెల్లడించారు.

హత్యాచార ఘటన తర్వాత ఆర్జీ కర్ ఆస్పత్రి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన్ను మరో కాలేజీకి ప్రిన్సిపాల్‌గా నియమించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుపై బాధిత కుటుంబానికి నమ్మకం లేదని తెలిపింది. అయినా ప్రిన్సిపాల్ స్టేట్‌మెంట్‌ను ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. అందుకే దర్యాప్తుపై అనుమానం కలుగుతోందని.. అంతేకాకుండా ఇది తీవ్రమైన లోపంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. అసలు ప్రిన్సిపాల్‌పై ఎందుకు ఫిర్యాదు చేయలేదని ధర్మాసనం నిలదీసింది. హత్యాచార ఘటనపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించింది.

వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అత్యంత దారుణంగా మృగాడు అత్యాచారం చేసి చంపేశాడు. ఆమె ప్రైవేటు భాగాల నుంచి, కళ్లు, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. అలాగే బొడ్డు మీద, కాళ్ల మీద గాయాలయ్యాయి. శరీరంలో అనేక చోట్ల గాయాలైనట్లుగా పోస్టుమార్టంలో తేలింది. అంతేకాకుండా ఆమెపై అసహజంగా అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిందితుడి మొబైల్ నిండా అశ్లీల చిత్రాలు, వీడియోలు కనిపించాయి. ఇక నిందితుడికి ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు. అవసరమైతే ఉరితీసుకోండని బిరుసుగా సమాధానం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.