Thiruparankundram: తమిళనాడులో మదురైలోని తిరుప్పరంకుడ్రంలో ‘‘కార్తీక దీపం’’పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదు. కొండపై ఉన్న దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. అధికారులు ఎప్పటిలాగే ‘‘ఉచ్చిపిళ్లయార్ మండపం’’ వద్దనే మహాదీపాన్ని వెలిగించారు. దీపం వివాదం నేపథ్యంలో మదురై వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే, దీపతూన్ వద్ద దీపాన్ని వెలిగిస్తారని ఎదురుచూస్తున్న హిందువులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. గతంతో నిర్వహిస్తున్న పద్ధతినే విజయ్ సర్కార్ అమలు చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో మదురై వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గంటగంటకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. భక్తులు విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసస్తున్నారు. మరోవైపు, బీజేపీతో పాటు హిందూ సంఘాల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
మదురై కలెక్టర్ నిశాంత్ కృష్ణ నవంబర్ 23 రాత్రి నుంచి నవంబర్ 25 ఉదయం 10 గంటల వరకు బీఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. మదురై నగర పోలీసు కమిషనర్ ఎస్. రాజేంద్రన్ తిరుపరంకుండ్రం కొండ ప్రాంతాన్ని ‘డ్రోన్ రెడ్ జోన్’గా ప్రకటించారు. అదనంగా 70కి పైగా సీసీటీవీ, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చివరకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ దీపతూన్ వద్ద దీపం వెలగకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

