Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు.. పలు విమానాలు రద్దు.. రైళ్లు ఆలస్యం..

Delhi

Delhi

Delhi: ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. గురువారం తెల్లవారుజామున ఢిల్లీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. బుధవారం రాత్రి 11.30 గంటలకు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ యూపీ, వాయువ్య మధ్యప్రదేశ్‌లోకి పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.

పొగమంచు కారణంగా ఢిల్లీలో విజిబిలిటీ తగ్గింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో మరోసారి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తర, ఈశాన్య భారతదేశాల్లో పొగమంచు కారణంగా గత 15 రోజలు నుంచి రోడ్డు, రైలు, విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ రోజు కూడా పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి రావాల్సిన 18 రైళ్లు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి.

Read Also: Delhi: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లి “లివ్-ఇన్ పార్ట్‌నర్” అఘాయిత్యం..

ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో కూడా వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా తగ్గాయి. బుధవారం పంజాబ్‌లోని షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలోని బలోవల్ సౌంఖ్రీలో సున్నా డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ నివేదిక తెలిపింది. అమృత్‌సర్‌లో 2 డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా నమోదైంది, లూథియానా మరియు పాటియాలాలో వరుసగా 2.8 మరియు 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హర్యానాలోని కర్నాల్‌లో 3.4 డిగ్రీలు, అంబాలా, హిసార్, నార్నాల్, రోహ్‌తక్‌లలో 4.9, 5.8, 3.5, 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది.

Exit mobile version