NTV Telugu Site icon

Delhi Police: యూత్ కాంగ్రెస్ చీఫ్ జుట్టు పట్టుకుని లాగిన ఢిల్లీ పోలీసులు.. వీడియో వైరల్

Congress Protests

Congress Protests

Delhi Police: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం రెండోసారి విచారించింది. సోనియాపై ఈడీ దర్యాప్తుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. రాహుల్‌ గాంధీ, ఇతర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలో విజయ్‌ చౌక్ వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు దాదాపు 50 మంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు నిరసన ప్రదర్శనలో భాగంగా రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

Sonia Gandhi: ముగిసిన సోనియాగాంధీ ఈడీ విచారణ.. రేపు కూడా మరోసారి..

దేశరాజధానిలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌పై ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకుడిని జుట్టు పట్టుకుని కారు లోపలికి పోలీసులు నెట్టేశారు. స్థానికంగా గుమిగూడిన మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న శ్రీనివాస్‌ను బలవంతంగా కారు లోపలికి తోసేశారు. అయినా బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు ర్యాపిడ్‌ యాక్షన్‌ పోర్స్‌ సిబ్బంది కాంగ్రెస్‌ నేత మెడ పట్టుకొని కారులో కూర్చొబెట్టారు. ఈ ఘటనపై దేశంలోని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ కారులో ఉండగా ఆయన కదలకుండా కాళ్లు, చేతులు గొంతు పట్టుకున్నారు. ఈ దృశ్యాలన్నింటిని అక్కడ ఉన్న వారు తమ ఫోన్లలో వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కాంగ్రెస్ నేతపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించేందుకు యత్నిస్తున్నామని.. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.